రియాద్ నుంచి ఢిల్లీకి వస్తూ కరాచీలో గో ఎయిర్ విమానం అత్యవసర ల్యాండింగ్
- విమానంలోని ప్రయాణికుడికి గుండెపోటు
- అత్యవసరంగా కరాచీకి మళ్లింపు
- అయినప్పటికీ ఫలితం శూన్యం
రియాద్ నుంచి ఢిల్లీ వస్తున్న గో ఎయిర్ విమానం మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. రియాద్‌లోని కింగ్ ఖాలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిన్న మధ్యాహ్నం విమానం బయలుదేరింది. మార్గమధ్యంలో 30 ఏళ్ల ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో విమానాన్ని కరాచీ మళ్లించి అక్కడి జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అయితే, అప్పటికే ప్రయాణికుడు మరణించాడు. దీంతో ఆ తర్వాత కాసేపటికే విమానం ఢిల్లీ బయలుదేరింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.