మజీథియాకు జడ్ ప్లస్ సెక్యూరిటీని తొలగించిన కేంద్రం.. మండిపడ్డ శిరోమణి అకాలీదళ్

  • వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించిన ఎస్ఏడీ
  • మజీథియాకు జడ్ ప్లస్ సెక్యూరిటీ తొలగింపు
  • ఇలాంటి వాటికి భయపడబోమన్న ఎస్ఏడీ
కొత్త వ్యవసాయ చట్టాలు మిత్రపక్షాలైన బీజేపీ, అకాలీదళ్ పార్టీల మధ్య చిచ్చు పెట్టిన సంగతి తెలిసిందే. పార్లమెంటులో ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ అకాలీదళ్ ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. ఇది జరిగిన రెండు నెలల తర్వాత... అకాలీ నేత బిక్రమ్ సింగ్ మజీథియాకు కేంద్ర ప్రభుత్వం జడ్-ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని తొలగించింది. దీనిపై అకాలీదళ్ మండిపడింది.

మజీథియాకు జడ్-ప్లస్ సెక్యూరిటీని తొలగించడం బీజేపీ నియంతృత్వ ధోరణిని సూచిస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి దల్జిత్ సింగ్ చీమా విమర్శించారు. రైతులకు అండగా అకాలీదళ్ నిలిచినందుకే కేంద్రం ఈ పని చేసిందని మండిపడ్డారు. రాజకీయ కక్షసాధింపులకు మజీథియా బాధితుడిగా మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, ఇలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని... రైతులకు అండగా తమ స్టాండ్ కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు, శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ సొంత బావమరిదే (భార్య హర్ సిమ్రత్ కౌర్ సోదరుడు) మజీథియా అనే విషయం గమనార్హం.


More Telugu News