ఇండియాకు అసలు ధరలో సగానికే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్!

  • జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి తొలి వారంలో అనుమతి
  • మరో పది రోజుల్లో అనుమతి కోరనున్న సీరమ్
  • పోటీలో ఉన్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్
ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికాలు సంయుక్తంగా తయారు చేయగా, ఇండియాలో పూణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కరోనా టీకా ధర ఇండియాలో ఎంఆర్పీ కన్నా 50 శాతం వరకూ తక్కువకే లభ్యం కానుంది.

ఇండియాలో తొలి వ్యాక్సిన్ టీకాలు జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి తొలి వారంలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో, తొలుత దీన్ని డాక్టర్లు, నర్సులు, మునిసిపల్ స్టాఫ్ కు అందించాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే, సీరమ్ ఇనిస్టిట్యూట్ తో కలిసి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రణాళికను సిద్ధం చేసింది. ఒకసారి బ్రిటన్ లో వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి రాగానే, ఆ వెంటనే ఇండియాలోనూ వాడకానికి పర్మిషన్ ఇస్తారన్న అంచనాతో సీరమ్ ముందుగానే అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది.

ఇండియాలో ఎమర్జెన్సీ వినియోగం నిమిత్తం వ్యాక్సిన్ కు అనుమతి ఇవ్వాలని సీరమ్ ఇనిస్టిట్యూట్ డిసెంబర్ లో కేంద్రానికి దరఖాస్తు చేయనుంది. అయితే, ఎన్ని డోస్ లు అందుబాటులోకి వస్తాయి? ఎంత మందికి వ్యాక్సిన్ ను పంపిణీ చేయగలము అన్న అంశాలపై పూర్తిగా సమీక్షించిన తరువాతనే ప్రభుత్వం ఈ విషయంలో తుది నిర్ణయానికి రావాలని భావిస్తోందని తెలుస్తోంది. ఇక ఈ వ్యాక్సిన్ ధర లండన్ ధరతో పోలిస్తే సగం వరకూ తక్కువకే ఇండియాలో లభ్యం కానుంది. అంటే రెండు డోస్ ల వ్యాక్సిన్ ధర రూ. 500 నుంచి రూ. 600 మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయని సీరమ్ అధికారులు తెలిపారు.

అయితే, ఇండియాకు సంబంధించినంత వరకూ ఎమర్జెన్సీ వినియోగానికి భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ గట్టిపోటీని ఇవ్వనుంది. ఒకటి, రెండో దశ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ సమర్పించి, అవి సంతృప్తికరంగా ఉంటే, అత్యవసర వినియోగానికి నియంత్రణా సంస్థల అనుమతి లభిస్తుందని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. అయితే, అది థర్డ్ ఫేజ్ ట్రయల్స్ మధ్యంతర ఫలితాలపై ఆధారపడి వుండనుందని తెలుస్తోంది.


More Telugu News