26/11కు పన్నెండేళ్లు... నాటి వీరులను తలచుకుంటున్న ముంబై!

  • నాడు విరుచుకుపడిన ముష్కరమూక
  • 166 మంది అమాయక ప్రజలు బలి
  • నేడు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ముంబై పోలీసులు
నవంబర్ 26, 2008... ముంబై మహానగరంపై ముష్కరమూకలు దాడికి దిగిన రోజు. పాకిస్థాన్ నుంచి సముద్ర మార్గం ద్వారా వచ్చిన పది మంది అత్యాధునిక తుపాకులతో విరుచుకుపడిన వేళ, 18 మంది భద్రతా సిబ్బంది అమరులు కాగా, 166 మంది అమాయక ప్రజలు బలయ్యారు. ఎన్నో వందల మందికి గాయాలూ అయ్యాయి. ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఎన్ఎస్జీ తో పాటు సైన్యం, మహారాష్ట్ర పోలీసులు రెండు రోజుల పాటు ఆపరేషన్ నిర్వహించి 9 మందిని హతమార్చగా, పట్టుబడిన కసబ్ కు కోర్టు మరణదండన విధించింది.

ఈ మారణ హోమానికి నేటితో పన్నెండేళ్లు పూర్తి కావడంతో, అమరులకు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే, కరోనాను దృష్టిలో ఉంచుకుని ప్రజలను మాత్రం పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నామని, దక్షిణ ముంబైలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఇటీవల నిర్మించిన స్మారక చిహ్నం వద్ద ఈ కార్యక్రమం జరుగుతుందని ఉన్నతాధికారులు తెలిపారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, సీఎం ఉద్ధవ్ థాకరేతో పాటు పలువురు మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు, అమరులైన పోలీసుల కుటుంబీకులు కార్యక్రమంలో పాల్గొననున్నారు.


More Telugu News