టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగడం ప్రమాదకరం: సీపీఎం నేత తమ్మినేని

  • బీజేపీ బలోపేతం కావడానికి టీఆర్ఎస్ స్వీయ తప్పిదాలే కారణం
  • మొన్నటి దాకా బీజేపీతో కేసీఆర్ సన్నిహితంగా ఉన్నారు
  • తమకే ఎసరు వస్తుందని అర్థమయ్యాక బీజేపీకి దూరంగా జరిగారు
దుబ్బాక ఉపఎన్నికతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడంపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగడం అత్యంత ప్రమాదకరమని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ చేసిన స్వీయ తప్పిదాలే బీజేపీ బలోపేతం కావడానికి దోహదం చేస్తున్నాయని అన్నారు. ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కొంత కాలం క్రితం వరకు బీజేపీతో ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహితంగా ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని చట్టాలకు టీఆర్ఎస్ మద్దతు పలికిందని... అయితే తమ అధికారానికే ఎసరు వస్తుందనే విషయం అర్థమైనప్పటి నుంచి బీజేపీకి కేసీఆర్ దూరం జరిగారని చెప్పారు. బీజేపీతో చేతులు కలిపిన ఏ పార్టీ బతకలేదని అన్నారు. ఆ పార్టీలన్నీ మనుగడను కోల్పోతాయని అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఈ నెల 8న తలపెట్టిన భారత్ బంద్ ను విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పారు.


More Telugu News