అమెరికా క్రికెట్ లీగ్ పై ఆసక్తి చూపుతున్న సత్య నాదెళ్ల, శంతను నారాయణ్..!

  • అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్
  • టీ20 క్రికెట్ కు అగ్రరాజ్యంలో ప్రాచుర్యం
  • ఇప్పటికే షారుఖ్ ఖాన్ పెట్టుబడులు!
  • అదే బాటలో సత్య నాదెళ్ల తదితరులు
అమెరికాలో గత కొంతకాలంగా క్రికెట్ క్రీడకు ఆదరణ పెరుగుతోంది. అగ్రరాజ్యంలో క్రికెట్ కు ప్రాచుర్యం కల్పించేందుకు ఐసీసీ తీసుకుంటున్న చర్యలు కూడా ఫలిస్తున్నాయి. తాజాగా, అమెరికన్ టీ20 లీగ్ లో బడా కంపెనీలు, బడా వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు.

మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్ సీ) పేరిట నిర్వహించే ఈ క్రికెట్ టోర్నీలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, పేటీఎమ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ, అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ్ తదితరులు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే తమ వ్యక్తిగత వాటాలను ఎంఎల్ సీ యాజమాన్య స్థాయిలో పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. అయితే వీరు ఏ జట్టును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది.

కాగా, ఎంఎల్ సీలో పెట్టుబడులు పెట్టిన సెలబ్రిటీల్లో బాలీవుడ్ నటుడు, కోల్ కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుఖ్ ఖాన్ కూడా  ఉన్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీతో అమెరికాలోనూ క్రికెట్ మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.


More Telugu News