ఏలూరు సమస్య తీవ్రతను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాలని పవన్, సోము వీర్రాజు నిర్ణయం

  • హైదరాబాదులో జనసేన, బీజేపీ నేతల భేటీ
  • హాజరైన పవన్ కల్యాణ్, సోము వీర్రాజు, నాదెండ్ల, దేవధర్
  • ఏలూరు సమస్యపై చర్చ
  • బాధితుల పరిస్థితిపై విచారం
  • తుపాను బాధితుల నష్టంపైనా చర్చ
హైదరాబాదులో ఈ ఉదయం జనసేన, బీజేపీ నేతలు సమావేశమయ్యారు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి వి.సతీశ్, బీజేపీ ఏపీ సహ ఇన్చార్జి సునీల్ దేవధర్, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఏలూరులో అంతుచిక్కని అనారోగ్య సమస్యలతో ప్రజల అవస్థలపై వారు విచారం వ్యక్తం చేశారు. ఏలూరులో వింతవ్యాధి ప్రబలుతున్న అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లాలని నేతలు నిర్ణయించారు. సమస్య మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో ఏలూరుకు ప్రత్యేక కేంద్ర బృందాలను పంపించి అధ్యయనం చేయించే దిశగా ప్రధానిని కోరాలని వారు నిర్ణయించారు.

అంతేకాకుండా, నివర్ తుపాను కారణంగా రాష్ట్రంలో రైతాంగం అన్ని రకాలుగా నష్టపోయిందని, రైతుల్లో ఏర్పడిన నిరాశా నిస్పృహలను దూరం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.


More Telugu News