కొవిడ్ వ్యాక్సిన్ల సరఫరాకు ‘స్పైస్‌జెట్’ రెడీ

  • ఓం లాజిస్టిక్స్, స్నోమన్ లాజిస్టిక్స్‌తో ఒప్పందం
  • నియంత్రిత ఉష్ణోగ్రత మధ్య వ్యాక్సిన్లు తరలించే సత్తా ఉందన్న స్పైస్‌జెట్
  • స్పైస్‌జెట్ వద్ద 17 కార్గో విమానాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ టీకాలు త్వరలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో వాటిని సురక్షితంగా తరలించడం ఎలా అన్న ప్రశ్నకు స్పైస్‌జెట్ తెరదించింది. తాము వాటిని సరఫరా చేస్తామంటూ ముందుకొచ్చింది. ఇందుకోసం సరుకు రవాణా సంస్థలైన ఓం లాజిస్టిక్స్, స్నోమన్ లాజిస్టిక్స్‌తో చేతులు కలిపింది.

తమ స్పైస్ ఎక్స్‌ప్రెస్ విమానాలు ఔషధాలు, వ్యాక్సిన్లు, రక్త నమూనాలను నియంత్రిత ఉష్ణోగ్రత మధ్య దేశీయంగా, అంతర్జాతీయంగా రవాణా చేయగలవని స్పైస్‌జెట్ వెల్లడించింది. 54 దేశీయ, 45 అంతర్జాతీయ నగరాలతో అనుసంధానమైన స్పైస్‌జెట్ వద్ద 17 కార్గో విమానాలున్నాయి. కాగా, కొవిడ్ వ్యాక్సిన్లను తరలించాలంటే మైనస్ 40 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. తమ వద్ద ఆ సదుపాయం ఉందని, నియంత్రిత ఉష్ణోగ్రతలో వాటిని తరలించే సామర్థ్యం తమకుందని స్పైస్‌జెట్ తెలిపింది.


More Telugu News