మీ సెల్ ఫోన్లు రెడీగా ఉంచుకోండి... ఇలాంటి వాడు మనకూ దొరుకుతాడు: ఆనంద్ మహీంద్రా

  • చిరుతలా పరుగులు తీస్తున్న రుడాల్ఫ్
  • అథ్లెటిక్ రంగంలో నయా సంచలనం
  • మెషీన్ లా పరిగెడుతున్నాడన్న ఆనంద్ మహీంద్రా
  • పరుగెడుతుంటే కాళ్లే కనిపించడంలేదని వ్యాఖ్యలు
  • మనదేశంలో ఇలాంటి వాళ్లు లేరా? అంటూ ట్వీట్
ప్రపంచ అథ్లెటిక్ రంగంలో రుడాల్ఫ్ ఇంగ్రామ్ ఓ సంచలనం. ఇంతజేసీ రుడాల్ఫ్ ఏమీ అథ్లెటిక్స్ దిగ్గజమేమీ కాదు. అతని వయసు కేవలం ఎనిమిదేళ్లే. అయితేనేం, చిరుతను తలపించే వేగంతో ట్రాక్ పై పరుగులు తీస్తూ తదుపరి ఫాస్టెస్ట్ మ్యాన్ ఇతనే అనిపించుకుంటున్నాడు. అమెరికాకు చెందిన రుడాల్ఫ్ ఇంగ్రామ్ పై భారత వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు.

"వీడు చిన్నారి కాదు... చిచ్చరపిడుగు. ఓ యంత్రంలా పరుగులు తీస్తున్నాడు. అతడు పరుగు తీస్తుంటే కాళ్లు కనిపించడంలేదు. నిస్సందేహంగా అతడే తదుపరి వరల్డ్ చాంపియన్. అయితే, 120 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో కూడా ఇలాంటి ప్రతిభావంతులు ఎక్కడో ఉండి ఉంటారు కదా! తమను ఎవరైనా గుర్తించకపోతారా అని వారు కచ్చితంగా ఎదురుచూస్తుంటారు. ఇంకెందుకాలస్యం... మీ సెల్ ఫోన్లను సిద్ధంగా ఉంచుకోండి. ప్రతిభావంతులను గుర్తించండి" అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. తన ట్వీట్ తో పాటు రుడాల్ఫ్ ఇంగ్రామ్ వీడియోను కూడా పంచుకున్నారు.


More Telugu News