విజయవాడ దుర్గమ్మను దర్శించుకుని.. ఉద్దండరాయునిపాలేనికి చంద్రబాబు.. అనుమతి లేదంటోన్న పోలీసులు

  • ఏపీ‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ జనభేరి
  • అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహణ
  • ఐదు కోట్ల మంది తరఫున తాను అమ్మవారిని ప్రార్థించానన్న చంద్రబాబు
  • న్యాయమే గెలుస్తుందని విశ్వసిస్తున్నానని వ్యాఖ్య
ఏపీ‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఐక్య కార్యాచరణ సమితి ‘జనభేరి’ పేరిట ఈ రోజు భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ సభను నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాసేపట్లో సభకు హాజరు కానున్నారు.

విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు.. అక్కడి నుంచి ఉద్దండరాయునిపాలెం బయల్దేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐదు కోట్ల మంది తరఫున తాను అమ్మవారిని ప్రార్థించానని చంద్రబాబు తెలిపారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని కోరుకుంటున్నానని చెప్పారు. పోరాటంలో చివరకు న్యాయమే గెలుస్తుందని తాను విశ్వసిస్తున్నానని తెలిపారు.  

మొదట ఆయన అక్కడ.. అమరావతికి శంకుస్థాపన చేసిన  శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి రాయపూడి సభకు వెళ్తారు. అయితే, ఉద్దండరాయునిపాలేనికి అనుమతి లేదని పోలీసులు చెబుతుండడం గమనార్హం. కాగా, జనభేరి సభకు  జనసేన, బీజేపీ తరఫున ప్రతినిధులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొంటారు.

ఈ సభకు దాదాపు 30 వేల మంది వస్తారని తెలుస్తోంది. అమరావతి ఆవశ్యకత తెలియజెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజధాని దళిత ఐకాస నేతలు ప్రధాన వేదిక పక్కనే మరో వేదికపై సాయంత్రం వరకూ నిరాహార దీక్ష చేపట్టారు. మూడు రాజధానుల ప్రతిపాదన ఉపసంహరించుకునే వరకూ వెనక్కి తగ్గేది లేదని అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు ఐకాస అంటున్నాయి.


More Telugu News