సిస్టర్ అభయ హత్యకేసు: దోషులకు జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం

  • దోషులను అభ్యంతరకర రీతిలో చూసిన సిస్టర్ అభయ
  • బండారం బయటపడుతుందని చంపేసిన వైనం
  • తొలుత ఆత్మహత్యగా చిత్రీకరణ
  • సీబీఐ దర్యాప్తులో వెలుగుచూసిన నిజం
సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో 28 ఏళ్ల తర్వాత దోషులు థామస్ కొట్టూరు, నన్ సెఫీలకు  ప్రత్యేక సీబీఐ కోర్టు నిన్న జీవిత ఖైదుతోపాటు లక్షలాది రూపాయల జరిమానా విధించింది. అంతేకాకుండా సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినందుకు ఇద్దరికీ అదనంగా మరో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 1992లో కేరళలోని కొట్టాయంలో సెయింట్ పయాస్ కాన్వెంట్‌ హాస్టల్‌లో చదువుతున్న 21 ఏళ్ల సిస్టర్ అభయ మృతదేహం బావిలో బయటపడింది.

స్థానిక పోలీసులు, ఆ తర్వాత దర్యాప్తు జరిపిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసును ఆత్మహత్యగా పేర్కొన్నారు. దీంతో స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం, మానవహక్కుల సంఘం న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో 1993లో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. 2009లో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది.

సుదీర్ఘ విచారణ అనంతరం నిందితులు థామస్ కొట్టూరు, నన్ సెఫీలను మొన్న దోషులుగా తేల్చిన సీబీఐ న్యాయస్థానం నిన్న వారికి శిక్షలు విధించింది. దోషులు ఇద్దరికీ జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం.. థామస్‌కు రూ. 6.5 లక్షలు, నన్ సెఫీకి రూ. 5.5 లక్షల జరిమానా విధించింది. అలాగే,  సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినందుకు గాను అదనంగా మరో ఏడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు..  జీవిత ఖైదుతోపాటు ఈ శిక్షను కూడా ఏకకాలంలో అమలు చేయాలని ఆదేశించింది.

సీబీఐ చార్జిషీటు ప్రకారం.. 27 మార్చి 1992న తెల్లవారుజామున 4.15 గంటలకు సిస్టర్ అభయ తన హాస్టల్ గది నుంచి కిచెన్ వైపు వెళ్లింది. ఆ సమయంలో థామస్ కొట్టూరు, జోస్ పుత్రుక్కయిల్‌, నన్ సెఫీలు అభ్యంతరకర రీతిలో కనిపించారు. దీంతో తమ బండారం బయటపడుతుందని భావించి అభయపై దాడి చేసి చంపేశారు. అనంతరం కాన్వెంట్ ప్రాంగణంలోని బావిలో పడేశారు.  ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుత్రక్కయిల్‌కు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు లేకపోవడంతో రెండేళ్ల క్రితం కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. కాగా, కుమార్తెకు న్యాయం జరగాలని ఆకాంక్షిస్తూ పోరాడిన అభయ తల్లిదండ్రులు నాలుగేళ్ల క్రితమే మరణించారు.


More Telugu News