ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి కదా.. ఉద్యోగులను మచ్చిక చేసుకునే ప్రయత్నం!: బండి సంజయ్ విసుర్లు

  • ఉద్యోగులు, నిరుద్యోగులను ఆరేళ్లుగా మోసం చేస్తూనే ఉన్నారు.
  • కేసీఆర్ ప్రకటనలో కొత్తదనమేమీ లేదు
  • ధనిక రాష్ట్రంలో వేతనాలు కూడా ఇవ్వలేకపోతున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోమారు విరుచుకుపడ్డారు. ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండడంతో ఉద్యోగులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ తన ప్రకటనతో ఉద్యోగులను మరోమారు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓపక్క ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇస్తుంటే, ధనిక రాష్ట్రమైన తెలంగాణలో వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. రెండేళ్లపాటు పీఆర్సీ చేయని పనిని ఇప్పుడు సీఎస్ నేతృత్వంలోని కొత్త కమిటీ చేస్తుందా? అని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రకటనలో కొత్తదనమేమీ లేదని, ఆయన మోసపూరిత మాటలను ఎవరూ విశ్వసించరని అన్నారు. ఆరేళ్లుగా ఉద్యోగులను, నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేస్తూనే ఉన్నారని అన్నారు.


More Telugu News