జస్టిస్ రాకేశ్ కుమార్ కు ఘనంగా వీడ్కోలు పలికిన రాజధాని రైతులు

  • పదవీ విరమణ చేసిన జస్టిస్ రాకేశ్ కుమార్
  • తరలివచ్చిన వందల మంది రాజధాని రైతులు, మహిళలు
  • ప్రజలను చూసి కారు ఆపిన రాకేశ్ కుమార్
  • శాలువా కప్పి సత్కరించిన రైతులు, మహిళలు
ఉన్నదున్నట్టు సూటిగా మాట్లాడతాడని పేరున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ పదవీ విరమణ చేశారు. సాధారణంగా జడ్జిలు రిటైరైతే సహచర న్యాయమూర్తులు, కోర్టుల సిబ్బంది వీడ్కోలు పలుకుతారు. కానీ జస్టిస్ రాకేశ్ కుమార్ విషయంలో భిన్నమైన వాతావరణం కనిపించింది. హైకోర్టు నుంచి ఆయన కారులో బయల్దేరగా, ప్రధాన రహదారికి దారితీసే సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇరువైపులా వందల మంది రాజధాని రైతులు, మహిళలు ప్లకార్డులు పట్టుకుని నిల్చుని ఘనమైన వీడ్కోలు పలికారు.

తమకు న్యాయం జరగని సమయంలో తామున్నాంటూ న్యాయమూర్తి రూపంలో స్పందించిన వ్యక్తి రాకేశ్ కుమార్ అని ఓ యువతి అభిప్రాయపడింది. ఇక, జస్టిస్ రాకేశ్ కుమార్ కాన్వాయ్ అటుగా రావడంతో ప్రజలు ఒక్కసారిగా ముందుకు ఉరికారు. రాజధాని రైతులు, మహిళలను చూడగానే రాకేశ్ కుమార్ తన వాహనాన్ని నిలిపారు. దాంతో మహిళలు, రైతులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువా కప్పి భావోద్వేగ వీడ్కోలు పలికారు. జస్టిస్ రాకేశ్ కుమార్ రాజధాని అంశానికి చెందిన పలు విచారణల సందర్భంగా అమరావతికి మద్దతుగా మాట్లాడారంటూ రోడ్డుకిరువైపులా నిల్చున్న ప్రజలు తమ కృతజ్ఞత తెలియజేశారు. లాంగ్ లివ్ రాకేశ్ కుమార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

జస్టిస్ రాకేశ్ కుమార్ బీహార్ లోని పాట్నా హైకోర్టు నుంచి గతేడాదే ఏపీ హైకోర్టుకు వచ్చారు. అప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో రైతులకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తూ వారి మనసు చూరగొన్నారు.


More Telugu News