ఫైజర్ వ్యాక్సిన్ వాడకానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ 'అత్యవసర' అనుమతి!

  • కీలక నిర్ణయం తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
  • ఇప్పటికే పలు దేశాల్లో వినియోగంలోకి
  • వ్యాధి నిరోధకతను పెంచుతోందన్న డబ్ల్యూహెచ్ఓ
యూఎస్ కు చెందిన ఫైజర్ - బయో ఎన్ టెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను అత్యవసరంగా వినియోగించేందుకు అనుమతి ఇస్తూ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో మరిన్ని దేశాలు ఈ టీకాను అనుమతించేందుకు మార్గం సుగమమైంది. బ్రిటన్ గత నెల 8న ఈ టీకాను ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతిచ్చిందన్న సంగతి తెలిసిందే. ఆపై యూఎస్ తో పాటు కెనడా, పలు యూరోపియన్ దేశాలు కూడా ఫైజర్ టీకాను ప్రజలకు అందుబాటులోకి తెచ్చాయి.

"2019లో చైనాలో వెలుగుచూసిన వైరస్ ను అడ్డుకునే వ్యాధి నిరోధకతను శరీరంలో పెంచేందుకు ఫైజర్ - బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ పనిచేస్తుంది. దీనికి ఎమర్జెన్సీ వాలిడేషన్ ను ఇస్తున్నాం" అని డబ్లూహెచ్ఓ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది ఎంతో పాజిటివ్ అడుగని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి మరియాంగెలా సిమావో వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ ను ప్రపంచంలోని ప్రజలందరికీ అందించేందుకు ఎంతో కష్టపడాల్సి వుంటుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకోసం అన్ని వ్యాక్సిన్ కంపెనీలూ సమష్టిగా కృషి చేయాలని అన్నారు.

వివిధ దేశాల్లోని ఔషధ నియంత్రణ సంస్థలు వివిధ విధానాలను అవలంబిస్తున్నాయని, టీకా దిగుమతి, పంపిణీ విషయాలపై మరింత దృష్టిని సారించాలని ఆయన కోరారు. ఈ విషయంలో ముఖ్య పాత్రను పోషించేందుకు యునిసెఫ్ వంటి సంస్థలు ముందుకు రావాలని సూచించారు.


More Telugu News