నాగార్జున ఇచ్చిన ఆ చెక్కుని చాలాకాలం దాచుకున్నాను: హీరో రవితేజ

  • దర్శకత్వ శాఖలో పనిచేసిన రవితేజ 
  • 'నిన్నే పెళ్లాడతా'కి నాగార్జున నుంచి చెక్కు
  • తొలి పారితోషికం 3500 రూపాయలు  
  • ఇప్పుడు పదికోట్ల వరకు పారితోషికం 
ఈవేళ మన హీరోలంతా చాలావరకు కోట్లలోనే పారితోషికం తీసుకుంటున్నారు. అయితే, వీరిలో చాలామంది ఒకప్పుడు అతితక్కువ మొత్తంలో పారితోషికం తీసుకున్న వారు కూడా వున్నారు. అందులోనూ సుదీర్ఘమైన కేరీర్ ని కొనసాగిస్తున్న హీరోలైతే చెప్పేక్కర్లేదు. తొలినాళ్లలో వేలల్లోనే పారితోషికం తీసుకుని వుంటారు. మరీ ముఖ్యంగా తొలిసారిగా అందుకున్న పారితోషికం మరీ తక్కువగా ఉంటుంది. అయినా, దాని గురించి ఇప్పుడు ఎంతో అపురూపంగా చెప్పుకుంటూ వుంటారు.

ఇక ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్రసీమలో ప్రవేశించి.. మొదట్లో అసిస్టెంట్ డైరెక్టరుగా.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. తదనంతరం ఇప్పుడు స్టార్ హీరోగా రాణిస్తున్న మాస్ మహారాజా రవితేజ విషయంలో కూడా ఇదే జరిగింది. తన తొలి పారితోషికంగా ఆయన అందుకున్నది కేవలం 3500 రూపాయలట.. అవును, ఈ విషయాన్ని తాజాగా ఆయనే వెల్లడించాడు.

"నిన్నే పెళ్లాడతా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేసినందుకు తొలి పారితోషికాన్ని అందుకున్నాను. అందుకు గాను 3500 రూపాయల చెక్కును నాగార్జున గారి చేతుల మీదుగా పుచ్చుకున్నాను. అది ఫస్ట్ రెమ్యునరేషన్ కావడంతో.. ఆ చెక్కుని చాలా కాలం వరకు అపురూపంగా దాచుకున్నాను. అయితే, ఓసారి డబ్బులు అవసరం పడి బ్యాంకులో దానిని మార్చేసుకున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు రవితేజ. అలాంటి రవితేజ ఇప్పుడు ఒక్కో సినిమాకు 10 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.


More Telugu News