ఇండోనేషియా గుహల్లో 45 వేల సంవత్సరాల నాటి ప్రాచీన చిత్రం గుర్తింపు

  • 2017లో ఇండోనేషియా గుహల్లో పరిశోధన
  • అడవి పంది బొమ్మను గుర్తించిన పరిశోధక విద్యార్థి
  • తాజాగా ఓ సైన్స్ జర్నల్ లో వెల్లడి
  • ఇంకా పురాతనమైనది కావొచ్చన్న ఆస్ట్రేలియా నిపుణుడు
ఇండోనేషియాలోని ఓ గుహలో చిత్రించిన అత్యంత పురాతన చిత్రాన్ని ఆస్ట్రేలియా పరిశోధకులు వెలుగులోకి తెచ్చారు. దట్టమైన అటవీప్రాంతంలోని గుహలో భారీ అడవిపంది బొమ్మను బస్రాన్ బుర్హాన్ అనే ఓ పరిశోధక విద్యార్థి 2017లో గుర్తించాడు. అయితే ఈ విషయాన్ని తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన మాక్సిమే ఆబెర్ట్ అనే ఆస్ట్రేలియా పురావస్తు శాస్త్రవేత్త  సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్ లో వెల్లడించారు. అప్పట్లో ఇండోనేషియా ప్రభుత్వంతో కలిసి ఈ పరిశోధన సాగించినట్టు తెలిపారు.

ఈ గుహలను లియాండ్ తెడోంగ్నే గుహలుగా పేర్కొంటారు. సున్నపురాయి కొండలుండే ప్రాంతంలోని మారుమూల లోయలో ఈ గుహ ఉంది. ఈ గుహ వద్దకు వర్షాకాలంలో వెళ్లడం అసాధ్యం. ఎందుకంటే, కొండకోనల్లో పొంగిపొరలే వాగులు, సెలయేళ్లతో అక్కడ వరద వాతావరణం ఉంటుంది. అందుకే, ఎండాకాలంలోనే గుహ వద్దకు వెళ్లే వీలుంటుంది.

కాగా, ఈ గుహలో గుర్తించిన అడవి పంది బొమ్మ 45,000 సంవత్సరాల నాటి మానవుడు గీసి ఉంటాడని మాక్సిమే ఆబెర్ట్ వెల్లడించారు. ఈ బొమ్మ పై భాగంలో పేరుకుపోయిన కాల్సైట్ పదార్థాన్ని విశ్లేషించడం ద్వారా బొమ్మ కాలాన్ని అంచనా వేశామని, వాస్తవానికి ఆ బొమ్మ ఇంకా పురాతనమైనదని భావిస్తున్నామని ఆబెర్ట్ వివరించారు.


More Telugu News