అయోధ్య విరాళాల విషయంలో క్షమాపణలు చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

  • విరాళాలు ఇవ్వొద్దంటూ నిన్న వ్యాఖ్యలు చేసిన విద్యాసాగర్ రావు
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు
  • వెనక్కి తగ్గిన విద్యాసాగర్ రావు
  • మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని విజ్ఞప్తి
  • తాను కూడా రాముడి భక్తుడినే అని వివరణ
మనకు యూపీ రాముడు అవసరమా... ఇక్కడ రామాలయాలు లేవా?... అయోధ్య రామమందిరం నిర్మాణానికి విరాళాలు ఇవ్వొద్దు అంటూ నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కాస్త వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలపై బీజేపీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటే అందుకు క్షమాపణలు తెలుపుకుంటున్నానని ప్రకటించారు.

విరాళాల విషయంలో తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పానని వివరించారు. కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించి, దుష్ప్రచారం చేస్తున్నారని విద్యాసాగర్ రావు ఆరోపించారు. తాను కూడా రాముడి భక్తుడినే అని, తాను కూడా అయోధ్య వెళతానని నష్టనివారణ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మత రాజకీయాలు మానుకుంటే బాగుంటుందని, దీనిపై రాజకీయం చేయడం తగదు అని అన్నారు.


More Telugu News