మరో సినిమాను ఖరారు చేసిన మెగాస్టార్!

  • పూర్తి కావస్తున్న 'ఆచార్య' సినిమా 
  • మోహన్ రాజాతో 'లూసిఫర్' రీమేక్
  • మెహర్ రమేశ్ తో 'వేదాళం' రీమేక్
  • బాబీ కథకు ఓకే చెప్పిన చిరంజీవి  
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మంచి జోరు మీదున్నారు. ఈ వయసులో కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా వరుసగా సినిమాలు చేసేస్తున్నారు. కుర్ర హీరోలు ఒక కొత్త సినిమాను లైన్లో పెట్టడానికే ఇబ్బందిపడిపోతున్న ప్రస్తుత తరుణంలో ఇప్పుడాయన ఏకంగా మొత్తం నాలుగు సినిమాలను సెట్ చేశారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆయన చేస్తున్న 'ఆచార్య' సినిమా త్వరలో పూర్తికానుంది.

ఇక దీని తరవాత చేయబోయే సినిమాలుగా ఆయన ఇప్పటికే 'లూసిఫర్' మలయాళ రీమేక్ ను, 'వేదాళం' తమిళ రీమేక్ ను ప్రకటించారు. వీటిలో లూసిఫర్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా.. వేదాళం చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం  వహించనున్నారు. ఇక తాజాగా చిరంజీవి తన నాలుగో చిత్రాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ చిత్రానికి ఆమధ్య 'వెంకీమామ' చిత్రాన్ని రూపొందించిన బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తాడు.

ఈ విషయాన్ని చిరంజీవి వెల్లడిస్తూ 'వీరు నా నలుగురు కెప్టెన్లు.. ఈ నలుగురూ ఫెంటాస్టిక్ ఫోర్.. చార్ కదమ్" అంటూ పోస్ట్ పెట్టి మెహర్ రమేశ్, మోహన్ రాజా, కొరటాల శివ, బాబీలతో కలసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. కాగా, చిరంజీవి మాస్ ఇమేజ్ కు తగ్గా పూర్తి ఎంటర్ టైన్మెంట్ కథను బాబీ తయారుచేశాడట. ఇది చిరంజీవికి బాగా నచ్చడంతో ప్రాజక్టును ఓకే చేసినట్టు చెబుతున్నారు.


More Telugu News