రైతుల ట్రాక్టర్ ర్యాలీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా

  • ఢిల్లీలో కిసాన్ పరేడ్
  • దేశ రాజధానిలో ఉద్రిక్తతలు
  • అధికారులతో సమీక్ష నిర్వహించిన అమిత్ షా
  • అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులకు సూచనలు
  • ర్యాలీలో రాజకీయ కార్యకర్తలు చొరబడ్డారన్న రైతులు
భారత రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఢిల్లీలో ఉద్ధృతంగా ఆందోళనలు కొనసాగుతుండడం పట్ల అమిత్ షా అధికారులతో సమీక్ష నిర్వహించారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శి, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ చీఫ్, సీనియర్ అధికారులతో చర్చించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలో అదనపు బలగాలు మోహరించాలని నిర్ణయించినట్టు సమాచారం. నేటి ఉదయం నుంచి జరిగిన పరిణామాలను అధికారులు అమిత్ షాకు వివరించారు. ఈ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన అధికారులకు సూచించారు.

కాగా, ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడం పట్ల రైతు సంఘాలు స్పందించాయి. ర్యాలీలోకి ఇతరులు చొరబడ్డారని రైతులు ఆరోపిస్తున్నారు. కిసాన్ పరేడ్ ను చెడగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ మండిపడ్డారు. ర్యాలీలోకి రాజకీయ పార్టీల కార్యకర్తలు చొరబడ్డారని, వారిని తాము గుర్తించామని వెల్లడించారు.

ఇక ఇతర రైతు సంఘాలు స్పందిస్తూ, కిసాన్ పరేడ్ కు భారీగా స్పందన వచ్చిందని తెలిపాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపాయి. ఆందోళన కార్యక్రమంలో అవాంఛనీయ ఘటనలు జరగడం బాధాకరమని పేర్కొన్నాయి.


More Telugu News