అందుకే కాంగ్రెస్ పార్టీ నాశ‌న‌మైంది: తెలంగాణ రాష్ట్ర మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

  • తెలంగాణ‌ ప్రజలు టీఆర్ఎస్ పాల‌న‌లో‌ సంతోషంగా ఉన్నారు
  • ఇది కాంగ్రెస్‌ పార్టీకి నచ్చడం లేదు
  • తెలంగాణ ప్రజల ఉసురు ఆ పార్టీకి త‌గిలింది
  • భ‌విష్య‌త్తులో ఒక్క సీటు కూడా గెలవ‌లేదు
తెలంగాణ‌ ప్రజలు టీఆర్ఎస్ పాల‌న‌లో‌ సంతోషంగా ఉండటం కాంగ్రెస్‌ పార్టీకి నచ్చడం లేదని రాష్ట్ర‌ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఉసురుతోనే ఆ పార్టీ నాశనమైంద‌ని విమ‌ర్శించారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ...   సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేత‌లు నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, ఇక‌నైనా ఇటువంటి చ‌ర్య‌లను మానుకోవాల‌ని హితవు పలికారు.

భవిష్యత్తులో తెలంగాణలో నిర్వ‌హించే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాదని ఆయ‌న జోస్యం చెప్పారు. ఎన్నో కేసుల్లో జైలుకు వెళ్లిన చరిత్ర కాంగ్రెస్ మంత్రులకు, నాయకులకు ఉంద‌ని అన్నారు. ఫ్లోరిన్ నుంచి నల్లగొండ జిల్లాను రక్షించిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానిదేన‌ని చెప్పారు.

తమ ప్ర‌భుత్వం రాష్ట్రంలో ప్రజల కోసం కట్టే ప్రాజెక్టులను కాంగ్రెస్ అడ్డుకుంటోంద‌ని మంత్రి ఆరోపించారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ 300లకు పైగా కేసులు వేసిందని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్‌ స్కాంల వల్లనే దేశం ఎంతో నష్టపోయిందని చెప్పారు. ప్రజలు కోరుకున్న దానికంటే తెలంగాణ‌లో ప్రస్తుతం అద్భుతమైన పాలన కొన‌సాగుతోందని చెప్పారు.

రాష్ట్రం ఏర్పడక ముందు తాగునీటికి సమస్యలు ఉండేవని చెప్పారు. తెలంగాణ ప్రజల కలలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని తెలిపారు. ఆరేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, రాష్ట్ర అభివృద్ధిని కేంద్ర మంత్రులు కూడా ప్రశంసించారని అన్నారు. తెలంగాణ అన్నిరంగాల్లో దేశంలోనే నంబర్‌ 1గా ఉందని చెప్పారు. ఈ విష‌యాన్ని ప‌లు నివేదికలు చెబుతున్నాయ‌ని తెలిపారు.


More Telugu News