గుంటూరు జిల్లాలో వలంటీరు, సచివాలయ ఉద్యోగిపై దుండగుల దాడి.. రూ. 19.21 లక్షలతో పరార్

  • దారికాచి దోపిడీకి పాల్పడిన దుండగులు
  • వలంటీరు వెంకటరెడ్డిపై క్రికెట్ బ్యాట్‌తో దాడి
  • నగల సంచి లాక్కుని పరార్
గుంటూరు జిల్లాలో కొందరు దుండగులు గ్రామ సచివాలయ ఉద్యోగి, వలంటీరుపై దాడికి దిగి వారి వద్దనున్న ఫించను సొమ్మును దోచుకున్నారు. నిన్న సాయంత్రం జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ సహాయకురాలు శివపార్వతి, వలంటీరు బీరవల్లి వెంకటరెడ్డి  ఫించన్ పంపిణీ నగదు కోసం పిడుగురాళ్లలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వచ్చారు. నగదు తీసుకున్న అనంతరం బైక్‌పై జూలకల్లు బయలుదేరారు.

ఈ క్రమంలో జానపాడు-పందింటివారిపాలెం గ్రామాల మధ్యనున్న కల్వర్టుపై ద్విచక్రవాహనంపై దారికాచిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఉద్యోగి బైక్‌ను ఆపి మీది ఏ ఊరని ప్రశ్నించారు. జూలకల్లు అని చెప్పగానే క్రికెట్ బ్యాటుతో అతడి తలపై మోదాడు. ఆపై సచివాలయ ఉద్యోగినిపైనా  దాడికి యత్నించారు. అనంతరం ఆమె వద్ద ఉన్న నగదు సంచిని తీసుకుని పరారయ్యారు. గమనించిన స్థానికులు వలంటీరును చికిత్స నిమిత్తం పిడుగురాళ్లలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శివపార్వతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News