అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన నిమ్మగడ్డ

  • గొల్లలగుంట సర్పంచ్ అభ్యర్థి ఇంటికి వెళ్లిన నిమ్మగడ్డ 
  • పుష్పవతిని పరామర్శించిన నిమ్మగడ్డ రమేశ్
  • ఘటనను మానవతా ధృక్పథంతో చూడాలని వ్యాఖ్య
తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంట సర్పంచ్ అభ్యర్థి పుష్పవతి భర్త శ్రీనివాస్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి ఆయనను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. నిన్న సాయంత్రం ఆయన చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. ఈ నేపథ్యంలో మృతుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటికి ఎసీఈసీ నిమ్మగడ్డ రమేశ్ వెళ్లారు. ఆయన భార్య పుష్పవతిని, ఇతర కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది రాజకీయాలు, తప్పులు ఎంచే సమయం కాదని అన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడరాదని, కొన్ని విషయాలను స్థానిక అంశాలు, మానవతా దృక్ఫథంతో చూడాలని చెప్పారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా శిక్ష అనుభవిస్తారని అన్నారు. జిల్లా ఎస్పీ ఘటనా స్థలిలోనే ఉండి, వ్యక్తిగతంగా కేసును పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. నిజాలు ఎప్పటికైనా వెలుగులోకి వస్తాయని, అప్పటి వరకు అందరూ సహనంతో ఉండాలని సూచించారు. ఓ వార్తాపత్రికలో తాను ఈ ఘటనకు సంబంధించిన వార్తను చదివానని తెలిపారు. ఘటనకు గల కారణాలను పరిశీలిస్తానని చెప్పారు.


More Telugu News