రిలయన్స్ జోరుకు బ్రేకేసిన ఢిల్లీ హైకోర్టు... ఫ్యూచర్ గ్రూప్ తో డీల్ పై సందిగ్ధం!

  • డీల్ ను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన అమెజాన్
  • 3.4 బిలియన్ డాలర్లకు ఆస్తులు విక్రయించేందుకు నిర్ణయం
  • డీల్ పై ముందడుగు వేయవద్దన్న హైకోర్టు
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ అనుబంధ రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్ డీల్ కు బ్రేక్ పడింది. తన రిటైల్ ఆస్తులను రిలయన్స్‌ కు విక్రయించాలని ఫ్యూచర్స్ గ్రూప్ డీల్ కుదుర్చుకోగా, ప్రస్తుతమున్న స్థితిని యథాతథంగా కొనసాగించాలంటూ  ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వెల్లడించే వరకూ డీల్ పై ముందడుగు వేయవద్దని ఆదేశించింది. దీంతో ఇండియా ఈ-కామర్స్ విభాగంలో ఆధిపత్యం కోసం అమెజాన్ ‌చేస్తున్న ప్రయత్నాలకు తొలి విజయం దక్కినట్టేనని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానించారు.

కాగా, ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన రిటైల్ ఆస్తులను 3.4 బిలియన్ డాలర్లకు రిలయన్స్ కు విక్రయించేందుకు ఇరు కంపెనీల మధ్యా చర్చలు సఫలమైన సంగతి తెలిసిందే. ఈ డీల్ కుదిరితే, ఈ-కామర్స్ రంగంలో అమెజాన్ ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు రిలయన్స్ కు అవకాశం దొరికినట్లవుతుందనడంలో సందేహం లేదు.

అయితే, ఈ డీల్ కు తొలి నుంచి అమెజాన్ రూపంలో తీవ్ర వ్యతిరేకత వస్తూనే ఉంది. తమకు, ఫ్యూచర్ గ్రూప్ నకు మధ్య గతంలో కుదిరిన ఒప్పందానికి ఈ డీల్ విరుద్ధమన్నది అమెజాన్ వాదన. ఈ డీల్ ను ఆపాలంటూ తొలుత సింగపూర్ అబ్రిట్రేటర్ ను అమెజాన్ ఆశ్రయించి, అనుకూల తీర్పు పొందింది. ఇప్పుడు తాజాగా ఢిల్లీ హైకోర్టు సైతం అమెజాన్ కు అనుకూలంగానే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. తాజా ఆదేశాలపై ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ ఇంకా స్పందించ లేదు.


More Telugu News