విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆపేయాలి: సీఎం జగన్ కు నారా లోకేశ్ లేఖ

  • విశాఖ ఉక్కు కర్మాగారంపై రగడ
  • ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
  • మండిపడుతున్న ఏపీ విపక్షాలు
  • విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ లోకేశ్ పునరుద్ఘాటన
విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరించుకుని, ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర నిర్ణయం ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. తాజాగా ఈ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ కు లేఖ రాశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిలిపివేయాలని పేర్కొన్నారు. వైసీపీ ఎంపీలు తమ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలం అయ్యారని విమర్శించారు.

ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్ పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ 28 ఎంపీలు (22 మంది లోక్ సభ సభ్యులు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు) ఉన్న వైసీపీ ఏమీ సాధించలేకపోయిందని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో ఐదో అతిపెద్ద పార్టీ అయివుండి కూడా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని అడ్డుకోవడంలో విఫలమైందని తెలిపారు. ఈ పరిణామం రాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిందని, నిరసనలకు కారణమైందని వివరించారు.

విశాఖ ఉక్కు కర్మాగారానికి 50 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న కర్మాగారం అని లోకేశ్ తెలిపారు. 2000 సంవత్సరంలోనూ ఇలాంటి ప్రతిపాదనే వచ్చినప్పుడు నాటి టీడీపీ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించి అడ్డుకుందని వివరించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పునరుద్ధరణ చర్యలు తీసుకునేలా వ్యవహరించిందని వివరించారు.

విశాఖ ఉక్కు కర్మాగారం చరిత్ర, ప్రజలతో ఉన్న అనుబంధం దృష్ట్యానే కాకుండా ఆర్థికపరంగానూ ఇది ఎంతో కీలకమైనదని లోకేశ్ తన లేఖలో స్పష్టం చేశారు. ఉక్కు అనేది భారత్ కు చెందిన ముఖ్య పరిశ్రమల్లో ఒకటని, 2032 నాటికి విశాఖ స్టీల్ ప్లాంటు అతిపెద్ద ఉక్కు ఉత్పాదక కర్మాగారంగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. ఉక్కు గనులు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అధీనంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని, కేంద్రం నుంచి ఆ మేరకు ప్రాజెక్టును సొంతం చేసుకునేలా రాష్ట్రం కోసం తీర్మానం చేయాలని లోకేశ్ సూచించారు.


More Telugu News