తొలిసారి భారతీయ మహిళా అటవీ అధికారికి ఐరాస అవార్డు

  • ఆసియా పర్యావరణ పరిరక్షణ అవార్డును దక్కించుకున్న సస్మిత లంక
  • పాంగోలిన్ల రక్షణ కోసం పాటుపడినందుకు దక్కిన గౌరవం
  • బెదిరింపులకు లొంగకుండా విధులు నిర్వర్తించిన సస్మిత
అంతర్జాతీయ పాంగోలిన్ అక్రమ రవాణా ముఠాకు ఆమె చెక్ పెట్టారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కు తగ్గలేదు. స్మగ్లర్లను కటకటాల వెనక్కు నెట్టారు. అందుకే ఐక్యరాజ్యసమితి (ఐరాస) అత్యున్నత పురస్కారానికి ఆమె ఎంపికయ్యారు. ఆమె కష్టాన్ని, సేవలను గుర్తించిన ఐరాస.. ఆసియా పర్యావరణ పరిరక్షణ అవార్డుకు ఎంపిక చేసింది.

ఆమె పేరు సస్మితా లంక. ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్ జిల్లా ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ కన్జర్వేటర్ గా పనిచేస్తున్నారు. కటక్ లో డివిజనల్ అటవీ అధికారిణిగా విధులు నిర్వర్తించేటప్పుడు పాంగోలిన్ స్మగ్లింగ్ పై ఆమె ఉక్కుపాదం మోపారు.

‘జెండర్ లీడర్ షిప్ అండ్ ఇంపాక్ట్’ విభాగంలో ఆమెకు ఈ అవార్డు వచ్చింది. తొలిసారి ఓ భారతీయ మహిళా అటవీ అధికారికి ఈ అవార్డు రావడం విశేషం. అవార్డు వచ్చిన సందర్భంగా ఆమె స్పందించారు. తన పనికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం ఆనందంగా ఉందన్నారు.

‘‘మేం మూడు పాంగోలిన్లను స్వాధీనం చేసుకున్నాం. అందులో ఒకటి అప్పటికే చనిపోయింది. వాటిని చైనా, వియత్నాం, మయన్మార్ వంటి దేశాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. 28 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశాం. అయితే, పాంగోలిన్లు అంతరించకుండా నిరోధించినప్పుడే వాటిని మనం నిజంగా కాపాడిన వాళ్లమవుతాం’’ అని ఆమె అన్నారు.

పాంగోలిన్ల రక్షణ కోసం ఆమె నజరానాను ప్రకటించారు. స్మగ్లర్లను పట్టించిన వారికి రూ.10 వేల బహుమతి ఇస్తామని చెప్పారు. దీంతో 30 గ్రామాల ప్రజలు కదలివచ్చారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతోనే తాను స్మగ్లర్లపై చర్యలు తీసుకోగలిగానని ఆమె చెప్పారు.


More Telugu News