షర్మిల పార్టీ పెట్టడంపై రేవంత్ రెడ్డి, ఓయూ జేఏసీ స్పందన!

  • షర్మిల కేసీఆర్ వదిలిన బాణం అన్న రేవంత్
  • తెలంగాణను సాధించుకున్నది రాజన్న బిడ్డలు ఏలాలని కాదని వ్యాఖ్య
  • రాష్ట్రంలోకి ఫ్యాక్షన్ రాజకీయాలను స్వాగతించలేమన్న ఓయూ జేఏసీ
ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు వైయస్ షర్మిల కొత్త పార్టీ గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతున్నప్పటికీ... ఈ అంశంపైనే జనాలు ఆసక్తికరంగా చర్చించుకున్నారు. మరోవైపు తెలంగాణలో వివిధ పార్టీల నేతలు తమదైన శైలిలో కామెంట్లు చేశారు.

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... షర్మిల జగనన్న వదిలిన బాణం కాదని, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి కేసీఆర్ వదిలిన బాణమని అన్నారు. కేసీఆర్ మరోసారి సీఎం అయ్యే అవకాశం లేదని... అందుకే షర్మిలను రంగంలోకి దించి, కొత్త నాటకానికి తెరతీశారని దుయ్యబట్టారు. తెలంగాణను సాధించుకున్నది ఈ ప్రాంత బిడ్డలు రాజ్యం ఏలడానికేనని... రాజన్న బిడ్డలు ఏలాలని కాదని మండిపడ్డారు. కృష్ణా జలాలపై షర్మిల వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

మరోవైపు పార్టీ పెడుతున్న షర్మిలపై ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ మండిపడింది. కొట్లాడి, పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో సమైక్యవాదుల పెత్తనం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉందని... రాష్ట్రంలోకి ఫ్యాక్షన్ రాజకీయాలను స్వాగతించలేమని స్పష్టం చేసింది. ఏపీలో చేయలేని పెత్తనాన్ని తెలంగాణలో ఎందుకు చేయాలనుకుంటున్నారని షర్మిలను ప్రశ్నించింది. అధికార దాహంతో తెలంగాణలో పార్టీని ప్రారంభించే ప్రయత్నం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని చెప్పింది.


More Telugu News