వైసీపీకి తోక పార్టీ కాదు.. షర్మిలనే మా సీఎం అభ్యర్థి: రాఘవరెడ్డి

  • గతంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన రాఘవరెడ్డి
  • ప్రస్తుతం షర్మిల వెనుక క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వైనం
  • తమ సీఎం అభ్యర్థి షర్మిల అని వ్యాఖ్య
వైయస్ షర్మిల పార్టీ వైసీపీకి తోక పార్టీ కాదని రాఘవరెడ్డి అన్నారు. గతంలో తెలంగాణలో వైసీపీకి రాఘవరెడ్డి కీలక నేతగా పనిచేశారు. ప్రస్తుతం షర్మిల పార్టీలో ఆయన కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈరోజు లోటస్ పాండ్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ, తమ అధినేత జగన్ అధికారాన్ని చేపట్టిన 18 నెలల్లోనే అన్ని హామీలను నెరవేర్చి, మంచి పాలనను అందిస్తున్నారని అన్నారు. వైసీపీని ఇక్కడ కొనసాగిస్తే... ఇరు రాష్ట్రాల మధ్య నీళ్లు, నిధులు, కొలువుల పంచాయతీ ఉంటుందని చెప్పారు. అందుకే అవసరమైతే ఏపీ ప్రభుత్వంతో గొడవ పడేందుకు సిద్ధపడే షర్మిల కొత్త పార్టీని స్థాపిస్తున్నారని అన్నారు.

రాజశేఖరరెడ్డి హయాంలో పొత్తుల పంచాయతీ ఉండేది కాదని... ఇప్పుడు కూడా షర్మిల పార్టీకి పొత్తులు ఉండవని రాఘవరెడ్డి అన్నారు. తమ సీఎం అభ్యర్థిగా షర్మిలనే ఉంటారని చెప్పారు. మన దేశంలో 3,212 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఏకైన మహిళ షర్మిల అని అన్నారు. వైయస్ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని చెప్పారు. వైయస్ కుటుంబం కేసీఆర్ కుటుంబం వంటిది కాదని అన్నారు. అన్ని జిల్లాల నేతలతో వరుస సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. 30 రోజుల తర్వాత ఒక శుభ ముహూర్తాన పార్టీ పేరు, జెండాను ప్రకటిస్తామని చెప్పారు.


More Telugu News