వాలంటైన్స్ డే స్పెషల్ అంటే ఇదే... భార్యకు ఎంతో అవసరమైన కానుక ఇచ్చిన భర్త

  • ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజు వేడుకలు
  • భార్యకు కిడ్నీ కానుకగా ఇచ్చిన భర్త
  • మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రితాబెన్
  • భర్త ఇచ్చిన కిడ్నీని రితాబెన్ కు అమర్చిన వైద్యులు
  • నిజమైన ప్రేమకు నిదర్శనంలా నిలిచిన వినోద్ భాయ్ పాటిల్
ప్రేమ సార్వజనీనమైన భావన. అందుకే వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమికుల భావవ్యక్తీకరణకు హద్దులు ఉండవు. తమ భాగస్వామి పట్ల తమ ప్రేమను చాటేందుకు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ప్రేమికుల దినోత్సవం స్పెషాలిటీ. అయితే అహ్మదాబాద్ కు చెందిన వినోద్ భాయ్ పాటిల్, రితాబెన్ పాటిల్ ల కథ అందుకు భిన్నం. రితాబెన్ పాటిల్ గత మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. కిడ్నీ మార్పిడి చేయకపోతే ఆమె జీవితాంతం డయాలసిస్ చేయించుకుంటూ ఉండాల్సిందే. డయాలసిస్ ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం మాత్రమే కాదు, ఎంతో బాధాకరమైన వైద్య ప్రక్రియ.

ఈ నేపథ్యంలో రితాబెన్ భర్త వినోద్ భాయ్ పాటిల్ ఎంతో ఉదాత్తమైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రేమికుల దినోత్సవం రోజునే తన కిడ్నీతో భార్యకు ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. వినోద్ భాయ్ ఇచ్చిన కిడ్నీని ఇవాళ వాలంటైన్స్ డే రోజునే వైద్యులు రితాబెన్ కు అమర్చారు. ఇన్నాళ్లు తనకు తోడునీడగా నిలిచిన భార్యను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూ ఉండలేకపోయానని, అందుకే ఆమెకు కిడ్నీ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని వినోద్ భాయ్ పాటిల్ తెలిపాడు. ఇది ప్రేమ అనుకుంటారో, బాధ్యత అనుకుంటారో... క్లిష్ట పరిస్థితుల్లో భార్యను ఒంటరిగా ఎలా వదిలేస్తాను అని పేర్కొన్నాడు. అంతేకాదు, ఇవాళ వినోద్, రితా దంపతుల 23వ పెళ్లిరోజు కావడం విశేషం.


More Telugu News