సరిహద్దు గ్రామాలపై సుప్రీంకోర్టులో విచారణ... ఆ మూడు గ్రామాలు తమవేనన్న ఏపీ!

  • తమ గ్రామాల్లో ఏపీ ఎన్నికలు జరుపుతోందన్న ఒడిశా
  • సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు
  • అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ సర్కారు
  • ఆ మూడు గ్రామాలు తమవేనని స్పష్టీకరణ
  • కౌంటర్ దాఖలుకు సమయం కావాలన్న ఒడిశా
  • విచారణ నాలుగు వారాల పాటు వాయిదా
ఏపీ, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న గ్రామాలపై ఎప్పట్నించో వివాదం ఉన్న సంగతి తెలిసిందే. ఆ గ్రామాలు తమవేనంటూ ఏపీ, ఒడిశా ప్రభుత్వాలు ఎవరికి వారే ఆ గ్రామాల్లో పాలన అమలు చేస్తున్నారు. అయితే ఏపీ సర్కారు తమ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరిపి కోర్టు ధిక్కరణకు పాల్పడిందంటూ ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ పై విచారణ నేడు కొనసాగింది. జస్టిస్ ఖాన్ విల్కర్ ధర్మాసనం విచారణ చేపట్టింది.

తమ భూభాగంలోని మూడు గ్రామాల పేర్లు మార్చిన ఏపీ సర్కారు పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహిస్తోందని ఒడిశా ఆరోపించింది. అందుకు బదులుగా ఏపీ ప్రభుత్వం విజయనగరం జిల్లా కలెక్టర్ తో కౌంటర్ దాఖలు చేయించింది. ఆ మూడు గ్రామాలు తమవేనని, గతంలోనూ ఆ గ్రామాల్లో తాము పంచాయతీ ఎన్నికలు నిర్వహించామని ఏపీ సర్కారు ఆ అఫిడవిట్ లో స్పష్టం చేసింది. ఆ మూడు గ్రామాలు అరకు లోక్ సభ నియోజకవర్గం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయని వివరించింది.

ఏపీ అఫిడవిట్ పై బదులిచ్చేందుకు తమకు నాలుగు వారాల సమయం కావాలని ఒడిశా ప్రభుత్వం కోరడంతో సుప్రీంకోర్టు అందుకు అంగీకరించింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.


More Telugu News