మా కూటమిలో ఎవరు చేరినా సీఎం అభ్యర్థిని నేనే: కమల్ హాసన్

  • తమిళనాడులో ఏప్రిల్ 6న ఎన్నికలు
  • షెడ్యూల్ విడుదల
  • పొత్తు ప్రయత్నాలు చేస్తున్న పార్టీలు
  • ఎంఎన్ఎంతో పొత్తుకు శరత్ కుమార్ చర్చలు
  • మార్చి 7న అభ్యర్థుల తొలి జాబితాకు కమల్ కసరత్తులు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల గంట మోగడంతో రాజకీయ పార్టీలన్నీ పొత్తులు కుదుర్చుకోవడంలో బిజీ అయ్యాయి. నటుడు కమల్ హాసన్ స్థాపించిన మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ కూడా పొత్తులపై ఇతర పక్షాలతో చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి తరఫున తానే సీఎం అభ్యర్థినని స్పష్టం చేశారు. తమ సిద్ధాంతాలకు దగ్గరగా ఉండే పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నామని, తమిళనాడులో తృతీయ కూటమి ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వెల్లడించారు.

కాగా, కమల్ ను నిన్న నటుడు శరత్ కుమార్ కలిశారు. శరత్ కుమార్ కు చెందిన ఆలిండియా సమత్తువ మక్కల్ కట్చి (ఏఐఎస్ఎంకే) పార్టీ ఎంఎన్ఎంతో జట్టు కట్టే విషయమై చర్చలు జరిపారు. దీనిపై కమల్ హాసన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.అటు, ఇందియ జననాయగ కట్చి (ఐజేకే) పార్టీ ఉప కార్యదర్శి రవిబాబు కూడా కమల్ ను కలిసి పొత్తు విషయం మాట్లాడారు.

ఇక, తమిళనాడులో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తామని కమల్ హాసన్ వెల్లడించారు. మార్చి 1 నుంచి ఇంటర్వ్యూలు చేపడతామని వివరించారు. అభ్యర్థుల తొలి జాబితా మార్చి 7న విడుదల చేస్తామని చెప్పారు. మార్చి 3 నుంచి ఎంఎన్ఎం కూటమి ఎన్నికల ప్రచారం షురూ అవుతుందని తెలిపారు. తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకే విడతలో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.


More Telugu News