గతవారం కరోనా వైరస్‌ కేసులు మళ్లీ పెరిగాయి: డబ్ల్యూహెచ్‌వో

  • గడిచిన ఏడు వారాల్లో తొలిసారిగా పెరుగుద‌ల‌
  • ఇది ఆందోళనకు గురిచేసే అంశం
  • చాలా దేశాల్లో క‌రోనా నిబంధనలను స‌డ‌లించ‌డ‌మే కార‌ణం
  • పేద దేశాల‌కు వ్యాక్సిన్ అంద‌డంలో జాప్యం
ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా విజృంభ‌ణ ప‌రిస్థితులు, వ్యాక్సినేష‌న్‌పై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌ టెడ్రోస్‌‌ అధానోమ్ స్పందించారు. జెనీవాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... ప్ర‌పంచంలో క‌రోనా కేసుల విజృంభణ విష‌యంలో గడిచిన ఏడు వారాల్లో తొలిసారిగా గత వారం పెరుగుదల ఉంద‌ని చెప్పారు.

ఇది ఆందోళనకు గురిచేసే అంశమని తెలిపారు. చాలా దేశాల్లో క‌రోనా నిబంధనలను స‌డ‌లించ‌డ‌మే ఇందుకు కారణమ‌ని అన్నారు. వైరస్‌ వేరియంట్ల విజృంభ‌ణ ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌జలు జాగ్రత్తలు పాటించ‌డం లేద‌ని ఆయ‌న చెప్పారు. ప‌లు దేశాల్లో క‌రోనా  కేసులు పెరుగుతున్నాయని అన్నారు.

వ్యాక్సినేష‌న్‌పై ఆయ‌న స్పందిస్తూ.. పేద‌ల దేశాల‌కు వ్యాక్సిన్ అంద‌డంలో జ‌రుగుతోన్న ఆల‌స్యంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ధనిక దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభమై మూడు నెలలు గడిచిన అనంత‌రం పేద దేశాలకు వ్యాక్సిన్‌ చేరడం విచారకరమన్నారు. తాము పేద, మధ్య ఆదాయ దేశాలకు వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

పశ్చిమ ఆఫ్రికాలోని రెండు దేశాల్లో నిన్న వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. పేద దేశాలకు వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేయ‌కుండా స్వప్రయోజనాలకు వాడుకొంటున్న ధనిక దేశాల తీరు స‌రికాద‌ని విమ‌ర్శించారు. ముప్పు పొంచి ఉన్న వారిని కాపాడటం అందరి బాధ్యతని తెలిపారు. ఈ ఏడాది మే చివరిలోపు 142 పేద దేశాలకు 23.7 కోట్ల క‌రోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీకి  సిద్ధం కావచ్చని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అంచ‌నా వేసుకుంది.


More Telugu News