మా ఆటగాళ్లకు కరోనా టీకా ఇచ్చే ఏర్పాట్లు చేయండి.. బీసీసీఐని కోరిన ఢిల్లీ క్యాపిటల్స్‌

  • ఏప్రిల్‌ 9 నుంచి ఐపీఎల్‌ సందడి
  • ఆటగాళ్లకు ముందే టీకా ఇచ్చేందుకు యోచన
  • వచ్చే వారమే బయో బబుల్‌లోకి వెళ్లనున్న క్రికెటర్లు
  • అంగీకరిస్తే విదేశీ క్రికెటర్లకూ టీకా
వచ్చే నెల 9 నుంచి ఐపీఎల్‌ సందడి ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో తమ ఆటగాళ్లకు కరోనా టీకాలు ఇచ్చే ఏర్పాట్లు చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్‌(డీసీ) టీం.. బీసీసీఐని కోరింది. తొలుత భారత ఆటగాళ్లు, అంగీకరిస్తే విదేశీ క్రికెటర్లకు కూడా టీకా అందజేస్తారని తెలుస్తోంది. అయితే, దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య మరోసారి పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే వారమే ఆటగాళ్లను బయో బబుల్‌లోకి పంపనున్నారు. ఆలోపే టీకా అందేలా చూడాలని డీసీ టీం యాజమాన్యం భావిస్తోంది.

ఇప్పటికే ఈ విషయంపై బీసీసీఐతో మాట్లాడామని.. వారు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో చర్చిస్తున్నారని డీసీ ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. మంగళవారం క్రికెటర్లు బయో బబుల్‌లోకి అడుగుపెట్టనున్నారని సమాచారం. ఇక అందుబాటులో ఉన్న డీసీ క్రికెటర్లు ఆరోజు నుంచే క్వారంటైన్‌ మొదలుపెడతారు. తొలుత వారం రోజుల కఠిన క్వారంటైన్ ‌ఉంటుంది. ఆ తర్వాత ముంబయిలో ప్రాక్టీస్‌ మొదలవుతుంది. కొవిడ్‌ 19 నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై బీసీసీఐ ఇంకా ‘స్టాండర్డ్‌ ప్రొసిజరల్ కోడ్‌’ జారీ చేయకపోవడంపై డీసీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.


More Telugu News