నేను అమెరికా నుంచి ఢిల్లీ వస్తే... స్టీల్ ప్లాంట్ కార్మికులు నన్ను కలవకుండా విజయసాయిరెడ్డిని కలిశారు: కేఏ పాల్

  • స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేఏ పాల్ స్పందన
  • కార్మికుల కోసం అమెరికా నుంచి వచ్చానని వెల్లడి
  • తననెవరూ పట్టించుకోవడంలేదని అసంతృప్తి
  • కార్మికులు తనను కలిస్తే ఆమరణ దీక్ష చేపడతానని స్పష్టీకరణ
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై స్పందించారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకు అండగా నిలిచేందుకు తాను అమెరికా నుంచి ఢిల్లీ వచ్చానని వెల్లడించారు. అయితే, ఢిల్లీ వచ్చిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నేతలు తనను కలవకుండా, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కలిశారని కేఏ పాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తాను హైకోర్టులో మూడు వ్యాజ్యాలు దాఖలు చేసిన సంగతి కార్మిక సంఘం నేతలకు తెలియదా? అని ప్రశ్నించారు.

కార్మిక సంఘం నేతలు గనుక తనను కలిసి చర్చిస్తే, తాను వారి తరఫున ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని కేఏ పాల్ ప్రకటించారు. కార్మికుల కోసం తాను అమెరికా నుంచి వస్తే వారు తనను కలవకపోవడం బాధాకరమని అన్నారు. వారి కోసం ఎలాంటి పోరాటానికైనా తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.


More Telugu News