స్టేడియాలకు ప్రేక్షకులను అనుమతించకపోవడంతో మ్యాచ్ చూసేందుకు సచిన్ వీరాభిమాని సాహసం

  • సచిన్ వీరాభిమానిగా సుధీర్ కుమార్ కు గుర్తింపు
  • భారత జట్టు ఆడే మ్యాచ్ లలో సుధీర్ సందడి
  • కరోనా నేపథ్యంలో వీక్షకుల్లేకుండా భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ లు 
  • అడవిలో ప్రయాణించి ఎత్తయిన ప్రదేశానికి చేరుకున్న సుధీర్
  • కొండ పైభాగం నుంచి పూణే మ్యాచ్ వీక్షణ
దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతుండడంతో భారత్-ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య పరిమిత ఓవర్ల మ్యాచ్ లకు ప్రేక్షకులను అనుమతించడంలేదు. టీ20 సిరీస్ లో కొన్ని మ్యాచ్ లకు వీక్షకులకు అనుమతి ఇచ్చినా, ఆ తర్వాత కరోనా కేసుల సంఖ్య అధికమవుతోంది. దాంతో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. అయితే, సచిన్ టెండూల్కర్ వీరాభిమానిగా పేరుగాంచిన సుధీర్ కుమార్ గౌతమ్ మాత్రం క్రికెట్ పై తన ప్రేమ ఎలాంటిదో ఘనంగా చాటుకున్నాడు.

ప్రస్తుతం టీమిండియా, ఇంగ్లండ్ మధ్య పూణేలో వన్డే పోటీలు జరుగుతుండగా, ఓ ఎత్తయిన ప్రదేశం నుంచి మ్యాచ్ ను చూసేందుకు అడవులు దాటుకుని మరీ వెళ్లాడు. మొదట స్టేడియం వెలుపల భారత ఆటగాళ్లను పలకరించిన సుధీర్ కుమార్... ఆపై ఘోరాదేశ్వర్ అనే కొండ ప్రాంతంపైకి చేరుకుని మ్యాచ్ ను వీక్షించాడు. పూణే స్టేడియం నుంచి ఘోరాదేశ్వర్ ప్రాంతం రోడ్డు మార్గం ద్వారా వెళితే 4.6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే మ్యాచ్ ను మొదట్నించి చూడాలన్న ఉద్దేశంతో సుధీర్ కుమార్ అటవీప్రాంతం గుండా ప్రయాణించి ఆ ఎత్తయిన కొండను చేరుకున్నాడు.

కాగా, ఆ అడవి గుండా వెళుతుంటే అనేక సార్లు పాములు కనిపించాయని, పలు దెబ్బలు కూడా తగిలాయని సుధీర్ కుమార్ వెల్లడించాడు. కానీ ఒక్కసారి ఆ కొండ పైభాగానికి చేరుకుని స్టేడియం వైపు చూడగానే తన బాధంతా తొలగిపోయిందని వివరించాడు. చీకటి పడితే అటవీప్రాంతంలో నడవడం కష్టం కాబట్టి అక్కడ్నించి సూర్యాస్తమయానికి గంట ముందే నిష్క్రమించానని, మొత్తమ్మీద ఓ 40 ఓవర్ల పాటు మ్యాచ్ చూశానని తెలిపాడు.

ముజఫర్ పూర్ కు చెందిన సుధీర్ కుమార్ సచిన్ కే కాదు, భారత జట్టుకు కూడా వీరాభిమాని. అందుకే సుధీర్ కు సచిన్, భారత జట్టు ఆటగాళ్లు మ్యాచ్ ల టికెట్లు పంపిస్తుంటారు. వంటిపై త్రివర్ణ పతాకం రంగులు పెయింట్ చేసుకుని, సచిన్ పేరు, నెంబరుతో, చేతిలో శంఖంతో సుధీర్ కుమార్ ఎక్కడున్నా ప్రత్యేకంగా కనిపిస్తాడు. మరో చేతిలో త్రివర్ణ పతాకం చేతబూని భారత ఆటగాళ్లను అడుగడుగునా ప్రోత్సహిస్తూ, తన పక్కనున్న ఇతర ప్రేక్షకులను హుషారెత్తిస్తుంటాడు.


More Telugu News