గిరిజనులపై అడవి జంతువుల కంటే హీనంగా దాడి చేసి రెండ్రోజులు గడుస్తున్నా సర్కారు చర్యలు తీసుకోలేదు: విజయశాంతి

  • ఇప్పపూల కోసం వెళ్లిన గిరిజనులపై దాడి
  • అటవీ అధికారులు క్రూరంగా వ్యవహరించారన్న విజయశాంతి
  • అధికారులు తూతూ మంత్రంగా పరామర్శించారని విమర్శ  
  • సర్కారు ఏం ప్రత్యామ్నాయాలు చూపిస్తోందన్న విజయశాంతి
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన గిరిజనులు ఇప్ప పూల కోసం అడవిలోకి వెళితే అటవీశాఖ సిబ్బంది వారిపై దారుణంగా దాడి చేశారని బీజేపీ నేత విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల పట్ల అటవీశాఖ సిబ్బంది జంతువుల కంటే హీనంగా దాడి చేసి రెండ్రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇప్ప పూల కోసం అడవిలోకి వెళ్లిన గిరిజనులు రాత్రి పొద్దుపోవడంతో అక్కడే నిద్రించారని, అదే వారి పాలిట శాపమైందని తెలిపారు.

అయినా, అదేదో మహాపాపం అయినట్టు అటవీశాఖ సిబ్బంది ఆడా, మగా అని చూడకుండా బూటుకాళ్లతో జననాంగాలపై దాడి చేశారని ఆరోపించారు. కానీ అధికారులు తూతూ మంత్రంగా పరామర్శించి వెళ్లిపోయారని విమర్శించారు.

"అడవి తల్లిని ఆశ్రయించి బతుకుతున్న గిరిజనబిడ్డలు మీకేం అపకారం చేశారు? అగ్నిప్రమాదాలంటూ గిరిజనులకు అటవీ ఉత్పత్తులు దక్కకుండా చేస్తే వారెలా బతకాలి?" అని విజయశాంతి నిలదీశారు. అటవీ అధికారులు, గిరిజనుల మధ్య ఎప్పట్నించో నలుగుతున్న ఈ సమస్యకు పరిష్కారం కోసం సర్కారు ఎలాంటి ప్రత్యామ్నాయాలు చూపిస్తోంది? అసలు, అడవుల పరిరక్షణకు తెలంగాణ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? అని ప్రశ్నించారు. ఒక్కసారి ఈ లెక్కలన్నీ తీస్తే సర్కారు చేతకానితనం బయటపడుతుందని వ్యాఖ్యానించారు.

మరోవైపు, డిచ్ పల్లి మండలం యానంపల్లి తండాలో బీజేపీ గిరిజన మోర్చా నేతలపై టీఆర్ఎస్ నేతలు దాడికి పాల్పడ్డారు. గుర్రంపోడు భూముల వ్యవహారంలోనూ అధికార పక్షానిది ఇదే తీరు. గిరిజనుల భూములను ఆక్రమించుకోవడమే కాకుండా, ప్రశ్నించిన బీజేపీ నేతలపై దాడులు చేయించి జైలుకు పంపారు. చివరికి పాత్రికేయులను కూడా వదల్లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులపై మీరు కక్షకట్టారా? అని విజయశాంతి ప్రశ్నించారు. తెలంగాణలో ఎక్కడ చూసినా దాడుల విష సంస్కృతేనని, ఈ సంస్కృతిని పెంచి పోషిస్తున్న అధికార పార్టీని వారి చర్యలే సర్పాలై కాటేయడం ఖాయమని స్పష్టం చేశారు.


More Telugu News