కుప్పంలో విగ్రహాలు ధ్వంసం చేసింది మతిస్థిమితంలేని మహిళ: ఎస్పీ సెంథిల్ కుమార్ వివరణ

  • కుప్పం మండలంలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో విగ్రహాలు ధ్వంసం
  • దీనివెనుక కుట్ర ఉందంటూ చంద్రబాబు ట్వీట్
  • ఘటనకు జ్యోతి అనే మహిళ కారణమన్న ఎస్పీ సెంథిల్ కుమార్
  • రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
చిత్తూరు జిల్లా కుప్పం మండలం సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో విగ్రహాలు ధ్వంసం చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెనుక కుట్ర ఉందని, ఆలయాలపై దాడుల ఘటనలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయితే ఈ కుప్పం ఘటనపై విచారణ జరిపిన చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆసక్తికర అంశం వెల్లడించారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేసింది జ్యోతి అనే మతిస్థిమితం లేని మహిళ అని తెలిపారు.

కుప్పం మండలంలోని గోనుగూరు బేటగుట్ట సుబ్రహ్మణ్యస్వామి ఆలయం మారుమూల ప్రాంతంలో ఉందని, ఇక్కడ వారంలో ఒక్క పర్యాయం మాత్రమే పూజలు నిర్వహిస్తారని వివరించారు. విగ్రహాల ధ్వంసం ఘటనలో కుట్రకు తావులేదని, మద్యం మత్తులోనే జ్యోతి విగ్రహాలు ధ్వంసం చేసిందని వివరించారు. విగ్రహాలు ధ్వంసం చేసిన విషయాన్ని ఆమె అంగీకరించిందని తెలిపారు.

ఈ వ్యవహారంలో వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు ట్వీట్ చేయడం సబబు కాదని అన్నారు. చంద్రబాబు ట్వీట్ ప్రజలను పక్కదారి పట్టించేలా ఉందని, పార్టీ శ్రేణులను రెచ్చగొట్టేలా ఉందని ఎస్పీ సెంథిల్ కుమార్ పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


More Telugu News