భారత్‌కు విరాళాలు ఇవ్వండి.. అంతర్జాతీయ సమాజానికి ప్రియాంక చోప్రా విజ్ఞప్తి

  • భారత్ రక్తమోడుతోంది
  • మీ వనరులను, శక్తిని భారత్‌ కోసం ఉపయోగించండి
  • ప్రతి ఒక్కరు సురక్షితంగా లేనంత కాలం ఏ ఒక్కరు సురక్షితం కాదు
  • లండన్‌లో ఉన్నా బాధితుల ఆర్తనాదాలు వింటున్నా
కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా దేశంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. ఆసుపత్రులలో బెడ్లు దొరక్క కొందరు, ఆక్సిజన్ అందక మరికొందరు.. ఇలా ప్రతి రోజూ వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ను ఆదుకునేందుకు ముందుకు రావాలంటూ బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు. విరాళాలు ఇవ్వాలని కోరారు.ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్టు చేశారు.

సామర్థ్యానికి మించిన బాధితులతో ఆసుపత్రులు, ఐసీయూలు కిటకిటలాడుతున్నాయని, అంబులెన్స్‌లు నిరంతరం పరుగులు తీస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోగులకు సరిపడా ఆక్సిజన్ అందడం లేదని, మరణాల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల శ్మశానాల్లో సామూహిక దహనాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. లండన్‌లో ఉన్న తాను భారత్‌లోని బాధితుల ఆర్తనాదాలు వింటున్నానన్నారు. భారత్ నా సొంత దేశమని, ఇప్పుడు రక్తమోడుతోందని ప్రియాంక అన్నారు.

అందరూ సురక్షితంగా లేనంత కాలం ఏ ఒక్కరు సురక్షితం కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, కాబట్టి ఆపదలో ఉన్న భారత్‌ను ఆదుకునేందుకు మీ వనరులను, శక్తిని ఉపయోగించి సహకరించాలని అభ్యర్థించారు. విరివిగా విరాళాలు ఇవ్వాలని, ట్విట్టర్‌లో తనను ఫాలో అయ్యేవారు తమకు తోచినంత సాయం చేయాలని ప్రియాంక కోరారు.


More Telugu News