సుప్రీం తీర్పు కేంద్రానికి చెంపపెట్టు : వడ్డే శోభనాద్రీశ్వర రావు

  • రాష్ట్రాలకు ఆక్సిజన్ పంపించడంలో మోదీ మీనమేషాలు లెక్కిస్తున్నారు
  • కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
  • నిపుణుల సలహాలను తీసుకోవాలి
కరోనా తీవ్రత నేపథ్యంలో యావత్ దేశం తీవ్రమైన ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటుంటే... ఆక్సిజన్ ను యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రాలకు పంపించాల్సిన ప్రధాని మోదీ మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారని మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు ఐదు రోజుల క్రితం బ్రిటన్ నుంచి 500, ఐర్లండ్ నుంచి 700 ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లు... ఈ నెల 2న అమెరికా నుంచి 1000, ఉజ్బెకిస్థాన్ నుంచి 150 కాన్సెన్ట్రేటర్లు వచ్చాయని... అయినా వాటిని ఇంత వరకు పంపిణీ చేయలేదని మండిపడ్డారు.

ప్రస్తుత దారుణ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని శోభనాద్రీశ్వరరావు అన్నారు. ఢిల్లీకి చేరిన ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లను వెంటనే రాష్ట్రాలకు పంపించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు వంటివని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అహంకార ధోరణిని వదిలేయాలని అన్నారు. నిపుణులు, ప్రముఖుల సలహాలను స్వీకరిస్తూ కేంద్రం ముందుకు సాగాలని హితవు పలికారు.


More Telugu News