నార్త్ కరోలినా బీచ్ లో వింత పదార్థం... అదేంటో చెప్పాలని ప్రజల సాయం కోరిన అధికారులు

  • అందరినీ ఆకర్షిస్తున్న వింత పదార్థం
  • కొన్నినెలల కిందట గుర్తించిన అధికారులు
  • తాజాగా సోషల్ మీడియాలో పోస్టు
  • స్క్విడ్ జీవి అంటూ ప్రజల స్పందనలు
  • దాన్ని సముద్రంలో వదిలేయాలని సూచనలు
అమెరికాలోని నార్త్ కరోలినాలో ఓ బీచ్ లో వింత పదార్థం అందరినీ ఆకర్షించింది. అలాంటిది ఎప్పుడూ చూసి ఉండకపోవడంతో ఆశ్చర్యపోవడం అధికారుల వంతయింది. దాని గురించి తెలిసిన వాళ్లు సమాచారం అందించాలని ఆ పదార్థం ఫొటోలను నార్త్ కరోలినాలోని నేషనల్ పార్క్స్ అధికారులు సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఆ పదార్థం సముద్రపు అలలకు తీరానికి కొట్టుకొచ్చిందని భావిస్తున్నారు. చేతి వేళ్లను తలపిస్తూ, కొన్ని గుడ్లను కలిగివున్న ఈ పదార్థాన్ని స్క్విడ్ జీవి అని అధికారులు అనుమానిస్తున్నా, వారికీ దానిపై కచ్చితమైన అవగాహన లేకపోవడంతో ప్రజల సాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ వింత పదార్థాన్ని కొన్నినెలల కిందటే గుర్తించినా, దాన్ని ఇటీవలే బహిర్గతం చేశారు.

అయితే చాలామంది దీన్ని స్క్విడ్ జీవిగా పేర్కొన్నప్పటికీ ఇంకా అధికారికంగా ఏమీ నిర్ధారణ కాలేదు. అది గుడ్లతో కూడిన స్క్విడ్ జీవి అని, దాన్ని తిరిగి సముద్రంలోకి పంపించేయాలని ప్రజలు సూచిస్తున్నారు. నిపుణులు మాత్రం దాన్ని కాలిఫోర్నియా మార్కెట్ స్క్విడ్ అని, ఇది తీరప్రాంతాలకు చేరువలోనే ఉంటుందని వివరించారు.


More Telugu News