రఘురాజు బెయిల్ పిటిషన్ వాదనల సందర్భంగా జగన్ పేరును ప్రస్తావించిన రోహత్గీ.. అభ్యంతరం వ్యక్తం చేసిన సీఐడీ న్యాయవాది!

  • వాయిదా అనంతరం పిటిషన్ పై కొనసాగుతున్న విచారణ
  • రఘరాజును జగన్ టార్గెట్ చేశారన్న రోహత్గీ
  • జగన్ పేరును లాగొద్దన్న ప్రభుత్వ న్యాయవాది
ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ మధ్యాహ్నం విచారణను ప్రారంభించిన ధర్మాసనం తెలంగాణ హైకోర్టు సమర్పించిన సీల్డ్ కవర్ లోని వైద్య నివేదికలో ఉన్న వివరాలను వెల్లడించింది. అనంతరం తరుపరి విచారణను మధ్యాహ్నం 2.30కి వాయిదా వేసింది. వాయిదా అనంతరం ఇప్పుడు మళ్లీ విచారణ కొనసాగుతోంది.

ఈ సందర్భంగా రఘురాజు తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే ఉద్దేశంతోనే రఘురాజును టార్గెట్ చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో తన క్లయింట్ పిటిషన్ వేశారని... అందువల్లే రఘురాజుకు బెయిల్ కూడా రాకుండా చేయాలనే దురుద్దేశంతో దేశద్రోహం కేసు నమోదు చేశారని చెప్పారు. రఘురాజుపై జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రఘురాజును అరెస్ట్ చేసిన విధానం, కస్టడీలో హింసించిన తీరు, మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు.. తదితర వివరాలను ధర్మాసనానికి వివరించారు. రఘురాజు కాలి బొటనవేలుకు ఫ్రాక్చర్ అయిందని అన్నారు.  

ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు లాయర్ దుశ్యంత్ దవే తన వాదనలు వినిపిస్తూ.. ఈ పిటిషన్లో జగన్ ప్రతివాదిగా లేరని... అందువల్ల జగన్ పేరును ఇందులోకి లాగొద్దని చెప్పారు. ఒక పిటిషనర్ గా తాను చెప్పాలనుకున్నది చెపుతానని రోహత్గి అన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం కలగజేసుకుంటూ... మీరిద్దరూ ఎందుకు తగువులాడుకుంటున్నారని ప్రశ్నించింది. కాసేపట్లో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించనుంది.


More Telugu News