బ్రహ్మంగారి మఠంలో వారసత్వంపై వివాదం

  • ఇటీవల కరోనాతో మరణించిన ఏడోతరం పీఠాధిపతి
  • కొత్త పీఠాధిపతి పదవి కోసం తీవ్ర పోరు
  • రంగంలోకి ఇద్దరు భార్యల సంతానం
  • ఎంపిక వాయిదా వేసిన అధికారులు
కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో వారసత్వం కోసం పోరు సాగుతోంది. ఇటీవల బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి (7వ తరం) కొవిడ్ కారణంగా మరణించారు. అయితే, ఆయనకు ఇద్దరు భార్యలు ఉండడంతో, ఏ భార్యకు చెందిన సంతానం పీఠాధిపతి బాధ్యతలు చేపట్టాలన్న దానిపై వివాదం ఏర్పడింది. ఇద్దరు భార్యలకు చెందిన సంతానం... పీఠం తమదంటే తమదని రంగంలోకి దిగడంతో కొత్త పీఠాధిపతి ఎవరన్నది ఇప్పటికీ తేలలేదు.

వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి మొదటి భార్యకు నలుగురు కొడుకులు, నలుగురు కుమార్తెలు కాగా... మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నారు. చిన్న భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పీఠాధిపతి అయ్యేందుకు అన్ని అర్హతలు తనకే ఉన్నాయని మొదటి భార్య పెద్ద కుమారుడు చెబుతుండగా, తన కుమారుడే పీఠాధిపతి అని భర్త వీలునామా రాశాడని రెండో భార్య చెబుతోంది.

మరోపక్క, వీలునామాలో తనపేరే ఉందని మొదటి భార్య రెండో కొడుకు కూడా రేసులోకి వచ్చాడు. దాంతో, బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి అంశం జటిలంగా మారింది. అయితే, రెండో భార్య పెద్దకొడుకు ఇంకా మైనర్ కావడంతో అతడికి పీఠాధిపతి అయ్యే అవకాశాలు తక్కువేనని భావిస్తున్నారు.

కొత్త పీఠాధిపతి ఎంపికకు దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ప్రతాప్ రంగప్రవేశం చేశారు. ఆయన వీరభోగ కుటుంబ సభ్యులతోనూ, స్థానికులతోనూ ఈ విషయంపై విచారించారు. స్థానికులు మాత్రం మొదటి భార్య రెండో కొడుకు వైపు మొగ్గుచూపగా, పీఠాధిపతి అయ్యే అర్హత తనకే ఉందని పెద్దకొడుకు వాదించినట్టు తెలిసింది. ఇక, తన కొడుకు మైనర్ కావడంతో పీఠాధిపతి బాధ్యతలు తాను స్వీకరిస్తానని రెండో భార్య చెప్పడంతో ఏమీ తేల్చలేక అధికారులు ఆ విచారణను అంతటితో నిలిపివేశారు.


More Telugu News