పగ సాధిస్తూ ఎన్నాళ్లీ ప్రతీకార పాలన?: నారా లోకేశ్

  • సంగం డెయిరీ సమావేశంలో మార్గదర్శకాలు పాటించారని వెల్లడి
  • డైరెక్టర్లపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపణ
  • సోమిరెడ్డిపైనా కక్ష సాధిస్తున్నారని వ్యాఖ్యలు
  • రూల్ ఆఫ్ లా తెలిసిన పోలీసుల బుద్ధి ఏమైందన్న లోకేశ్   
తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ధూళిపాళ్ల నరేంద్ర సవాల్ విసిరినట్టే జరిగిందని, అమూల్ రెడ్డి సంగం డెయిరీలో మొలిచిన గడ్డి కూడా పీకలేకపోయారని ఎద్దేవా చేశారు. అయితే, సంగం డెయిరీ డైరెక్టర్ల సమావేశంలో కరోనా మార్గదర్శకాలు పాటిస్తే, నిబంధనలు ఉల్లంఘించారంటూ తప్పుడు కేసు పెట్టించారని ఆరోపించారు.

కరోనా మార్గదర్శకాలపై కేసు నమోదు చేయాల్సి వస్తే... ప్రతిరోజు మాస్కు ధరించకుండా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్న ఈ మూర్ఖపు ముఖ్యమంత్రిపై రోజుకో కేసు నమోదు చేయాలని లోకేశ్ వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న ర్యాలీలపై కేసులు నమోదు చేయాలని, గన్ మన్ తో బూట్లు మోయించి, బహిరంగ సభ నిర్వహించిన గిద్దలూరు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఆనందయ్యను అనధికారికంగా బందీ చేసి, మందును వెబ్ సైట్ లో పెట్టి అడ్డంగా అమ్ముకోవాలన్న బ్లీచింగ్ రెడ్డి ప్లాన్ ను సోమిరెడ్డి బట్టబయలు చేశారని లోకేశ్ వెల్లడించారు. కానీ, సోమిరెడ్డిపై కక్షతో తప్పుడు కేసు బనాయించారని విమర్శించారు. కక్షతో రగిలిపోతూ, పగ సాధిస్తూ ఎన్నాళ్లీ ప్రతీకార పాలన? అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు.

ప్రశ్నించేవారిపై ఫేక్ కేసులు నమోదు చేయాలని, ఫేక్ సీఎం ఒత్తిడి చేస్తే... ఉన్నత చదువులు చదివి, రాజ్యాంగం, చట్టం, రూల్ ఆఫ్ లా తెలిసిన పోలీసుల బుద్ధి ఏమైందని లోకేశ్ నిలదీశారు. అన్యాయంగా కేసులు పెడుతూ, అక్రమంగా అరెస్టులు చేస్తూ న్యాయస్థానాల్లో దోషులుగా నిలవడానికి పోలీసులకు సిగ్గుగా అనిపించకపోవడం విచారకరం అని పేర్కొన్నారు.


More Telugu News