అందుకే దేశంలో రెండో ద‌శ క‌రోనా విజృంభ‌ణ‌.. మూడో ద‌శ కూడా వ‌స్తుంది: రాహుల్ గాంధీ

  • మృతి చెందిన వారిలో 90 శాతం మంది స‌రైన వైద్య స‌దుపాయాలు అందని వారే
  • వారి మృతికి  ముఖ్య కార‌ణం ఆక్సిజ‌న్ కొర‌తే
  • వారి కుటుంబ స‌భ్యుల క‌న్నీళ్ల‌ను ప్ర‌ధాని మోదీ కార్చుతోన్న క‌న్నీళ్లు  తుడవలేవు
  • ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌లపైనే మోదీ దృష్టి పెట్టారు
దేశంలో క‌రోనా క‌ట్ట‌డిలో కేంద్ర ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శ్వేతప‌త్రం విడుద‌ల చేసి విమ‌ర్శ‌లు గుప్పించారు. రెండో ద‌శ విజృంభ‌ణ‌కు కార‌ణాలు, మూడో ద‌శను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ఆయ‌న వివ‌రాలు తెలిపారు.

'రెండో ద‌శ క‌రోనా విజృంభ‌ణ స‌మ‌యంలో మృతి చెందిన వారిలో 90 శాతం మంది స‌రైన వైద్య స‌దుపాయాలు అంద‌కే మృతి చెందారు. వారి మృతికి ముఖ్య కార‌ణం ఆక్సిజ‌న్ కొర‌తే. వారి కుటుంబ స‌భ్యుల క‌న్నీళ్ల‌ను ప్ర‌ధాని మోదీ కార్చుతోన్న క‌న్నీళ్లు తుడవలేవు. వారిని ఆయ‌న క‌న్నీరు కాపాడ‌లేదు.. ఆక్సిజ‌న్ మాత్ర‌మే కాపాడుతుంది' అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

'కానీ, వైద్య స‌దుపాయాల గురించి ఆయ‌న ప‌ట్టించుకోకుండా ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌లపైనే దృష్టి పెట్టారు. కుటుంబానికి ఆధారంగా నిలిచిన వారు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాల‌కు ప‌రిహారం కూడా చెల్లించ‌లేని స్థితిలో ప్ర‌భుత్వం ఉంది. దేశంలోనే పెట్రోల్‌, డీజిల్ రేట్ల‌ను పెంచేసి రూ.4 ల‌క్ష‌ల కోట్లు ప్ర‌భుత్వం రాబ‌ట్టింది' అని రాహుల్ గాంధీ చెప్పారు.

'అయిన‌ప్ప‌టికీ క‌రోనా మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ఇవ్వ‌ట్లేదు. వారికి ప‌రిహారం అందించాల్సిందే. ఇక‌పై క‌రోనా మూడో ద‌శ విజృంభ‌ణ‌ను క‌ట్ట‌డి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకోవాలి. మేము విడుద‌ల చేస్తోన్న శ్వేత‌ప‌త్రం ఈ విష‌యంపై బ్లూ  ప్రింట్  వంటిది. మూడో ద‌శ క‌రోనా విజృంభ‌ణపై ఎలా స్పందించాలో తెలియ‌జేస్తుంది' అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

'ప్ర‌భుత్వానికి ప‌లు ర‌కాల స‌మాచారాన్ని అందిస్తున్నాం. అలాగే, రెండో ద‌శ క‌ట్ట‌డిలో వైఫ‌ల్యాల‌ను తెలియ‌జేస్తున్నాం. దేశంలో మూడో ద‌శ క‌రోనా విజృంభ‌ణ భారీ న‌ష్టాన్ని తెచ్చిపెట్ట‌నుంది. దాన్ని నియంత్రించ‌డానికి మేము ప‌లు సూచ‌న‌లు చేస్తున్నాం. మూడో ద‌శ విజృంభ‌ణ ఉంటుంద‌ని దేశం మొత్తానికి తెలుసు. దాన్ని ఎదుర్కోవ‌డానికి ప్ర‌భుత్వం త‌ప్ప‌కుండా సంసిద్ధంగా ఉండాలి.. ఇదే మా ఉద్దేశం' అని రాహుల్ గాంధీ చెప్పారు.

'దీన్ని ఎదుర్కోవ‌డంతో వ్యాక్సినేష‌న్ మూల స్తంభం వంటిది. శ‌ర‌వేగంగా వ్యాక్సిన్లు వేయాల్సి ఉంటుంది. 100 శాతం వ్యాక్సినేష‌న్ పూర్తి కావాలి. రెండో అంశం ఏంటంటే ఆసుప‌త్రిలో ఆక్సిజ‌న్, వెంటిలేట‌ర్లు వంటి వైద్య స‌దుపాయాలు, త‌గిన‌న్ని బెడ్లు, ఇత‌ర‌ వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. నిన్న దేశంలో రికార్డు స్థాయిలో 86.16 ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసులు వేయ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌యం. అయితే, కేవ‌లం ఒక్క రోజు మాత్ర‌మే ఇలా ప‌ని చేసి ఊరుకోవ‌ద్దు' అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

'దేశంలోని ప్ర‌జ‌లంద‌రికీ వ్యాక్సిన్లు వేసే వ‌ర‌కు ఇలాగే ప‌నిచేయాలి. దేశంలోని రాష్ట్రాల‌ను బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఇతర పార్టీల పాలిత రాష్ట్రాలుగా కేంద్ర ప్ర‌భుత్వం చూడకూడ‌దు. ఎలాంటి వివ‌క్ష లేకుండా వ్య‌వ‌హ‌రించాలి. క‌రోనా కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతోన్న పేద ప్ర‌జ‌ల‌కు నేరుగా ఆర్థిక సాయాన్ని అందించాలి' అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.


More Telugu News