ధోనీ సన్నాఫ్ సచిన్ టెండూల్కర్... ఈ దరఖాస్తేంటో చూడండి!

  • టీచర్ల నియామకానికి నోటిఫికేషన్
  • ఇంటర్వ్యూలకు 15 మంది ఎంపిక
  • అందులో మొదటి పేరు ధోనీదే!
  • ఫోన్ చేస్తే స్పందన కరవు
ఆధార్ కార్డుల్లో, రేషన్ కార్డుల్లో సాధారణ పౌరుల ఫొటోలకు బదులు సినీ తారల ఫొటోలు ప్రచురితం కావడం అప్పుడప్పుడు చూస్తుంటాం. కొందరు ఆకతాయిల కారణంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయి. ఇది కూడా ఆ కోవలోకే వస్తుంది. చత్తీస్ గఢ్ లో ఇటీవల ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేయగా, ఇంటర్వ్యూకు 15 మందితో తుది జాబితా రూపొందించారు.

అయితే, ఆ జాబితాలో ఓ వ్యక్తి తన పేరు ధోనీ అని, తండ్రి పేరు సచిన్ టెండూల్కర్ అని, ఓ వర్సిటీలో ఇంజినీరింగ్ చేసినట్టుగా పేర్కొనడం చూసి అధికారులు విస్తుపోయారు.  ఆ దరఖాస్తు రాజ్ పూర్ జిల్లా చిరునామాతో ఉండగా, అధికారులు వాకబు చేస్తే అది నకిలీ చిరునామా అని తేలింది. ఇక, ఆ 15 మందిని ఇంటర్వ్యూకు పిలవగా 'ధోనీ' మాత్రం రాలేదు. దరఖాస్తులో పేర్కొన్న ఫోన్ నెంబరుకు కాల్ చేస్తే స్విచాఫ్ అని వచ్చింది. దాంతో ఆ దరఖాస్తు ఓ ఆకతాయి చేష్ట అని గుర్తించారు.

దరఖాస్తు పరిశీలన సమయంలోనే పూర్తి వివరాలు ధ్రువీకరించుకోకపోవడం పట్ల అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. కాగా, నకిలీ దరఖాస్తుపై చత్తీస్ గఢ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది.


More Telugu News