ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ పరిస్థితి విషమం

  • అనారోగ్యంతో బాధపడుతున్న కల్యాణ్ సింగ్
  • తొలుత డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి
  • అక్కడి నుంచి ఎస్‌జీపీజీఐకి
  • పరామర్శించిన రాజ్‌నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత కల్యాణ్ సింగ్ (89) పరిస్థితి విషమించింది. నిన్న సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే లక్నోలోని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్‌జీపీజీఐ)లో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు.

నెఫ్రాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, ఎండోక్రినాలజీ, న్యూరో ఆటోలజీ నిపుణుల బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది. కల్యాణ్ సింగ్ ఆరోగ్యం గత రెండు వారాలుగా క్షీణిస్తుండడంతో శనివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆయనను డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి మరింత దిగజారడంతో అక్కడి నుంచి ఎస్‌జీపీజీఐకి తరలించారు.

సీనియర్ నేత అయిన కల్యాణ్ సింగ్ రాజస్థాన్‌కు గవర్నర్‌గానూ పనిచేశారు. ఆయన ఆరోగ్య విషయం తెలుసుకున్న వెంటనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్రదేవ్ సింగ్ తదితరులు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.


More Telugu News