ఆఫ్ఘనిస్థాన్ లో దౌత్య కార్యాలయం మూసివేత అవకాశాలపై కేంద్రం వివరణ

  • ఆఫ్ఘన్ నుంచి నాటో బలగాల ఉపసంహరణ
  • భద్రతపై సర్వత్రా ఆందోళన
  • తాలిబన్లు పంజా విసురుతారన్న అంచనాలు
  • పరిస్థితిని సమీక్షిస్తున్నామన్న భారత విదేశాంగ శాఖ
ఆఫ్ఘనిస్థాన్ లో దశాబ్దాల తరబడి కొనసాగిన నాటో సేనలు వెళ్లిపోయాయి. ప్రధానంగా అగ్రరాజ్యం అమెరికా తన బలగాలను ఆప్ఘన్ గడ్డపై నుంచి పూర్తిగా ఉపసంహరించుకుంది. మిగతా దేశాల దళాల ఉపసంహరణ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో, ఆఫ్ఘనిస్థాన్ లో తమ దౌత్య సిబ్బంది భద్రతపై అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పలు దేశాలు తమ దౌత్య కార్యాలయాలను మూసివేసి, దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించేందుకు యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ దేశాల్లో భారత్ కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది.

దీనిపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆఫ్ఘనిస్థాన్ లో ప్రస్తుత పరిణామాలను తాము పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకైతే, కాబూల్ లోని దౌత్య కార్యాలయం, మూడు చోట్ల ఉన్న కాన్సులేట్ల మూసివేతపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. పరిస్థితులను సమీక్షిస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా సహా విదేశీ బలగాలు వెళ్లిపోవడంతో తాలిబన్లు మళ్లీ విజృంభించే అవకాశాలున్నాయని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.


More Telugu News