తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు రాకూడదనే తెలంగాణలో వైసీపీని విస్తరించలేదు: సజ్జల

  • విజయవాడలో మీడియాతో మాట్లాడిన సజ్జల
  • తెలంగాణతో ఏపీ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని వెల్లడి
  • సీఎం జగన్ స్థిరమైన వైఖరితో ఉన్నారని స్పష్టీకరణ
  • షర్మిల పార్టీపై స్పందించాల్సిన అవసరంలేదని వ్యాఖ్యలు
వైసీపీ రాష్ట్ర ప్రధాన  కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు రాకూడదనే తెలంగాణలో వైసీపీని విస్తరించలేదని వెల్లడించారు. తెలంగాణతో మన ప్రయోజనాలు ముడిపడి ఉన్న నేపథ్యంలో వీలైనంత వరకు అక్కడి రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నది తమ వైఖరి అని చెప్పారు.

తెలంగాణలో తాము రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తే అవి ఏపీ ప్రయోజనాలకు భంగం కలిగించవచ్చని, లేదా, ఇక్కడ ఏపీ ప్రజల్లో పలు అనుమానాలకు దారితీయొచ్చని, లేదా, అలాంటి అనుమానాలు సృష్టించే శక్తులకు ఊతమివ్వొచ్చని సజ్జల అభిప్రాయపడ్డారు. అందుకే సీఎం జగన్ ఏపీలో తప్ప ఇంకెక్కడా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదని స్థిర అభిప్రాయంతో ఉన్నారని వివరించారు.

వైఎస్ షర్మిల తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్న పార్టీ గతంలో ఆమె ప్రకటించిన మేరకే జరుగుతోందని, ఇందులో తాము మాట్లాడాల్సిందేమీలేదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశామని, ఆ తీర్మానాన్ని కేంద్రం గౌరవించాలని అన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తాము ఎంత చేయాలో అంతా చేస్తామని సజ్జల ఉద్ఘాటించారు.


More Telugu News