ఫ్యాషన్ పిచ్చి ప్రాణాలు తీసింది... బ్రెజిల్ లో టీనేజీ అమ్మాయి విషాదాంతం

  • కంటికి రింగు కుట్టించుకోవాలనుకున్న అమ్మాయి
  • వ్యతిరేకించిన తల్లిదండ్రులు
  • ఫ్రెండ్ సాయంతో కుట్టించుకున్న టీనేజర్
  • వికటించిన ప్రయత్నం
టెక్నాలజీ అభివృద్ధి, సోషల్ మీడియా రాకతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అది అన్ని మూలలకూ పాకిపోతుంది. ముఖ్యంగా ఫ్యాషన్లు ఒక చోటి నుంచి మరో చోటికి త్వరగా వ్యాపిస్తున్నాయి. ఫ్యాషన్లంటే కుర్రకారులో ఉన్న మోజు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఫ్యాషన్లపై క్రేజు శృతి మించితే ఈ బ్రెజిల్ అమ్మాయిలాగే విషాదాంతం అవుతుంది.

బ్రెజిల్ ఈశాన్య రాష్ట్రం మినాస్ గెరాయిస్ లోని ఎంగెన్ హిరో కాల్డాస్ పట్టణంలో నివసించే ఇసబెల్లా ఎడ్వార్డా డిసౌజా ఓ హైస్కూల్ విద్యార్థిని. ఆమె వయసు 15 సంవత్సరాలు. అయితే, ఫ్యాషన్లంటే వెర్రి వ్యామోహం ప్రదర్శించే ఈ అమ్మాయి తన కనురెప్పకు రింగ్ కుట్టించుకోవాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నం వికటించడంతో విషాదకర రీతిలో ప్రాణాలు కోల్పోయింది.

తన ముఖం పలు భాగాల్లో రింగ్ లు గుచ్చాలని మొదట తన తల్లిని కోరింది. అయితే తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా అందుకు అంగీకరించలేదు. దాంతో తన స్నేహితురాలి సాయంతో తన కోరిక నెరవేర్చుకుంది. కానీ మూడ్రోజుల్లోనే ఇసబెల్లా ఆరోగ్యం దెబ్బతింది. ఆమె ముఖమంతా ఉబ్బిపోయి బెలూన్ లా మారిపోయింది. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె కనురెప్పలకు గుచ్చుకున్నది లోహపు వస్తువు కావడంతో, ఇన్ఫెక్షన్ తీవ్రమైంది. ఆసుపత్రిలోనే ఆమె నాలుగుసార్లు గుండెపోటుకు గురైంది. చివరికి పరిస్థితి విషమించడంతో మృతి చెందింది.

ఇసబెల్లా మృతితో కుటుంబ సభ్యుల ఆవేదన అంతాఇంతా కాదు. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొన్ని రకాల లోహపు వస్తువులను శరీరం పరాయి వస్తువులుగా భావించి స్వీకరించలేదని, ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు తెలిపారు.


More Telugu News