ఏపీ ఫైబర్ నెట్లో అక్రమాలపై సీఐడీ దర్యాప్తుకు ఆదేశించిన ప్రభుత్వం

  • గత ప్రభుత్వ హయాంలో అక్రమాలంటూ ఆరోపణలు
  • సెట్ టాప్ బాక్సుల కొనుగోళ్లపై ఫిర్యాదులు
  • ప్రాథమిక ఆధారాలు సమర్పించిన ఫైబర్ నెట్ ఎండీ, చైర్మన్
  • లోతైన దర్యాప్తు అవసరమని భావించిన ఏపీ సర్కారు
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయంటూ తీవ్ర ఆరోపణలు రావడం తెలిసిందే. ఇంటింటికీ ఇంటర్నెట్, టెలిఫోన్, టీవీ చానళ్లను ఒకే కేబుల్ కనెక్షన్ ద్వారా ఇవ్వాలని గత ప్రభుత్వం భావించింది. అయితే, అందుకు అవసరమై జి పాన్ సెట్ టాప్ బాక్సులు, ఇతర సాంకేతిక పరికరాల కొనుగోళ్ల టెండర్లలో భారీగా అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఫైబర్ నెట్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ప్రాథమికంగా కొన్ని అంశాలను గుర్తించి, వాటిని ప్రభుత్వానికి నివేదించారు. ఆయా అంశాలను పరిశీలించిన ప్రభుత్వం ఈ వ్యవహారంలో లోతైన దర్యాప్తు అవసరం అని భావించింది. ఈ నేపథ్యంలో, దీనిపై సీఐడీ దర్యాప్తు చేయాలంటూ ఆదేశించింది. సమగ్రంగా విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని సీఐడీ అడిషనల్ డీజీకి స్పష్టం చేసింది.


More Telugu News