బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాలో నేడు, రేపు దంచికొట్టనున్న వానలు

  • భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • రాయలసీమలోనూ ఓ మోస్తరు వర్షాలు పడే సూచన
  • చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక
  • వీరవాసరంలో అత్యధికంగా 92.5 మి.మీ వర్షపాతం నమోదు
బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాలో కొన్ని చోట్ల నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని పేర్కొంది. ఈ రెండు రోజులు రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది.

పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనానికి తోడు దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో సముద్ర తీరం వెంబడి గంటకు 55-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కాబట్టి మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

మరోవైపు, తూర్పుగోదావరి, విశాఖపట్టణం, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నిన్న విస్తారంగా వానలు కురిశాయి. సామర్లకోటలో 83, విశాఖపట్టణంలో 83.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో అత్యధికంగా 92.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.


More Telugu News